Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణ అధ్వానం
- ఏడాదికి రూ.25 కోట్లు ఖర్చు
- పట్టించుకోని జీహెచ్ఎంసీ
నవతెలంగాణ - సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టాయిలెట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన టాయిలెట్లకు నిర్వహణ లేకుండా పోయింది. నిర్వహణ లేకపోవడంతో నిర్మించిన వాటిలో చాలా వాటిని అధికారులు మూసేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఏజెన్సీల నిర్వాకంతో సగానికి సగం టాయిలెట్లను రోజువారీగా శుభ్రం చేయడం లేదు.
కోటి జనాభాకు 10వేలు
స్వచ్ఛ భారత్ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ అందుబాటులో ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంటుందని అధికారుల అంచనా. ఈ లెక్క ప్రకారం 10వేల పబ్లిక్ టాయిలెట్లు అవసరం ఉంటుందని అధికారుల అంచనా. జీహెచ్ఎంసీ పరిధిలో ఆయా సంస్థల ఆధ్వర్యంలో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో నడుస్తున్న రెండు వేల టాయిలెట్లు ఉన్నాయి. మరో 8వేల టాయిలెట్లకుగాను లూకేఫ్ ఆధ్వర్యంలో 1000 టాయిలెట్లు, బీఓటీలో మరో 1000 టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సుమారు రూ.100కోట్లకుపైగా ఖర్చు చేసి టాయిలెట్లను నిర్మించారు. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 2500 టాయిలెట్లు మాత్రమే ఉన్నట్టు క్షేత్రస్థాయి అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది.
నిర్వహణకు రూ.25 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలోని బీఓటీ, లూకేఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాయిలెట్లు మినహా మిగిలిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు నెలకు రూ.2కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.25కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. 20 పబ్లిక్ టాయిలెట్లను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి మరుగుదొడ్లను ప్రతి రోజూ నిర్దేశిత సమయాల్లో ఐదు విడతలు పరిశుభ్రం చేయడానికి ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించారు. కానీ, టాయిలెట్ల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. గతంలో టాయిలెట్ల నిర్వహణ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పర్యవేక్షించేవారు. కానీ జోనల్, సర్కిల్ స్థాయిలో ఇవ్వడంతో ఎక్కడ టాయిలెట్ ఉంది? ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పని చేస్తున్నవి సగమే..
నగరంలోని ఆయా ప్రాంతాల్లో 2500కుపైగా టాయిలెట్లు ఉన్నాయి. అయితే, వీటిలో సగం మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ నెలకు సుమారు రూ.2కోట్ల చొప్పున బిల్లులు కాజేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీకి కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్న నగరవాసులకు కనీసం టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో బల్దియా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు సమీపంలో రూ.10లక్షలకుపైగా ఖర్చుచేసి పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. కానీ పట్టుమని పదిరోజులు కూడ పనిచేయకుండానే మూసేశారు. అందుకు నిర్వహణ లేకపోవడమే కారణం. గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ టాయిలెట్ల పరిస్థితి ఇలాగే ఉందని నగరవాసులు వాపోతున్నారు.
టాయిలెట్ల కేటగిరి సంఖ్య
బీఓటీ(బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) 313
లూకేఫే 88
పీఎఫ్‌టీ(ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్) 531
ఈ-టాయిలెట్ 1
సులబ్ కాంప్లెక్స్ 10
బయోటాయిలెట్ 410
ట్విన్ బయోటాయిలెట్ 216
బయో ఎఫ్ఆర్జీ 30
సివిల్ 64
ఎఫ్ఓబీ 13
ఎఫ్ఆర్జీ 94
ఎఫ్ఆర్పీ (పైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) 30
మాడ్యులర్ 30
మైల్డ్ స్టీల్ క్యాబిన్స్ 245
ఆర్సీసీ 104
టాటా నెస్ట్ మాడ్యూలర్ టాయిలెట్స్ 144
షీ టాయిలెట్స్ 29
పబ్లిక్స్ టాయిలెట్స్ 24
కాయా 89
బస్ షెల్టర్స్ టాయిలెట్స్ 3
మొబైల్ టాయిలెట్ 1
కమ్యూనిటీ టాయిలెట్స్ 1
మెట్రో టాయిలెట్స్ 56