Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య ఉద్యమాలు ఉధృతం కావాలి : సీఐటీయూ రాష్ట్ర మహాసభలో ప్రజా, రైతు సంఘాల నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నదనీ, పోరాటాల ద్వారానే వాటిని వెనక్కి కొట్టి హక్కులను సాధించుకోగలుగుతామని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. దేశంలో ఐక్య ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీ ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో మల్లుస్వరాజ్యం నగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలనుద్దేశించి వారు మాట్లాడారు.
పోరాటాల ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
మోడీ, అమిత్‌షా, ఎవరైనా సరే పోరాటాల ముందు తల వంచాల్సిందేనని ఢిల్లీ రైతాంగ పోరాటం నిరూపించిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో రాతపూర్వకంగా హామీ తీసుకున్న ఘనత ఆ పోరాటానికి దక్కుతుందని చెప్పారు. చలి, వానా, ఎండలు, పోలీసుల లాఠీచార్జీలు, జల ఫిరంగులు, రాజకీయ బెదిరింపులు ఆ పోరాటాన్ని ఏమీ చేయలేకపోయా యన్నారు. ఆ పోరాటానికి సీఐటీయూ అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కార్మికుల సమ్మెల సందర్భంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చి మద్దతు తెలిపాయన్నారు. తెలంగాణలో జరిగిన రైతుసంఘం యాత్రకు సీఐటీయూ సహకారం అందించిందన్నారు. సరూర్‌నగర్ నుంచి ఉప్పల్ వరకు నిర్వహించిన కార్మిక, కర్షక ప్రదర్శన విజయ వంతంలోనూ సీఐటీయూ కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో రైతాంగంపైనా, కార్మికరంగంపైనా మోడీ సర్కారుదాడి తీవ్రతను పెంచిందనీ, అదే సమయంలో ప్రజలను మతోన్మాదంతో చీల్చుతూ ముందుకెళ్తున్నదని విమర్శించారు. ఇలాంటి తరుణంలో కార్మిక, కర్షక ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
సంక్షోభాలు పట్టిపీడిస్తుంటే...ఆర్థికవృద్ధి ఎలా మోడీ? తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
విద్యా, వైద్య, ఆర్థిక, ఉపాధి కల్పన, ఇలా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉంటే దేశంలో ఎలాంటి సంక్షోభాలు లేవనీ, ఆర్థికాభివృద్ధి వేగంగా సాగుతున్నదని ప్రధాని మోడీ ఎలా చెబుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు విమర్శించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనీ, ఆకలి, దారిద్య్రం, ఆకలిచావులు పెరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్‌లో ఆహార కొరత ఏర్పడబోతున్నదని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి తరుణంలో దేశమంతటా బాగుందని చెప్పడానికి నోరెలా వస్తుంది మోడీ అని నిలదీశారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి సొంతిండ్లు లేవనీ, వారందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ పోరాటానికి సీఐటీయూ సహకరించాలని కోరారు.
సంస్కృతి, పరిరక్షణ పేరుతో ఆదివాసీ గూడాల్లోకి బీజేపీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు
సంస్కృతి పరిరక్షణ పేరుతో ఆదివాసీ గూడాల్లోకి బీజేపీ విస్తరిస్తు న్నదనీ, యువకుల మెదళ్లలో మతోన్మాదాన్ని జొప్పిస్తున్నదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ యువకులను ముస్లింలపైకి రెచ్చగొడు తున్న తీరును వివరించారు. సీఐటీయూ, ఆదివాసీ గిరిజన సంఘం, ఇతర ప్రజా సంఘాలు విడివిడి పోరాటాల కంటే ఐక్యంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత రాష్ట్రంలో నెలకొందని నొక్కి చెప్పారు.
అటవీ సంరక్షణ నియమాలు-2022ని ఉపసంహరించుకోవాలి : తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్
దేశంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో అభత్రాభావంలోకి నెట్టవేయబడుతున్న తరుణంలో కార్మికులు, శ్రామికులను ఐక్యం చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ తెలిపారు. ముఖ్యంగా దేశంలో గిరిజనులు ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అడవులే జీవనాధారంగా జీవిస్తున్న లక్షలాది మంది గిరిజనులను బలవంతంగా బయటకు గెంటివేసేవిధంగా బీజేపీ ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొస్తున్నదని విమర్శించారు. ప్రకృతి సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేసే చర్యలకు పూనుకుంటున్న తీరును వివరించారు. అటవీ సంరక్షణ నియామాలు-2022ని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను సైతం కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు మోడీ సర్కారు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. దేశంలో పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
సామాజిక ఉద్యమాలకు బాసటగా సీఐటీయూ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
సామాజిక ఉద్యమాలకు సీఐటీయూ బాసటగా నిలబడుతున్నదనీ, రానున్న కాలంలో ఆ కృషి మరింత పెరగాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు ఆకాంక్షించారు. దేశంలో అట్టడుగు వర్గాల వారైన దళితులు ఓవైపు సామాజిక అణచివేత, మరోవైపు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. మోడీ సర్కారు వచ్చాక దళితులపై 300 శాతం దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు మార్చడం జరిగిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో దళితులపై దాడులు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనూ 76 కుల దురంహకార హత్యలు జరిగాయని తెలిపారు. ఈ దాడుల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా సాంఘిక, కుల వివక్ష, అంటరానితనం, జోగినీ వ్యవస్థలు కొనసాగటం ఆందోళకరమన్నారు. ఇలాంటి వాటిని దీనిని తుదముట్టడించటం అత్యంత చైతన్యవర్గమైన కార్మిక వర్గంతోనే సాధ్యమని నొక్కి చెప్పారు.