Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకుల ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించండి
- బీసీ గురుకులాల పనివేళలను మార్చండి
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి చదువుల పేరుతో ఉపాధ్యాయులు, విద్యార్థులపై కలిగిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారించాలనీ, విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల మరణాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఒత్తిడి వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల చావులు ఇంకెన్నాళ్లని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకేసారి లెక్కకు మిక్కిలి గురుకుల పాఠశాలలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారని వారు తెలిపారు. విద్యార్థులు అరకొర వసతి సౌకర్యాలతోనే సతమతమవుతున్నారని పేర్కొన్నారు. నైవాసిక విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు కూడా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. కానీ గురుకులాల్లో సిబ్బందికి నివాస గృహాలు లేకపోగా కనీస విశ్రాంతి సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలతో సహా రాత్రి వేళల్లో పర్యవేక్షక అధ్యయనం విధులు ముగించుకుని వెళ్లే సందర్భంలో ఉపాధ్యాయులు తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఆ క్రమంలోనే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీసీ గురుకుల బాలికల పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గీత రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఆటోను లారీ ఢకొీన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి మరణించారని గుర్తు చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారనీ, మరికొందరు మరణించారని పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగా కొందరు గుండెపోటుతో మరణించారని తెలిపారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు అన్ని సొసైటీల్లో పనివేళలు కొంత మార్పు చేసినప్పటికీ, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల పనివేళలు మాత్రం నైవాసిక పద్ధతిలో ఉదయం 6.45 నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉండాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. వారంలో రెండు, మూడు రోజులు రాత్రిపూట బస (నైట్ డ్యూటీ) కూడా చేయాల్సి వస్తుందని వివరించారు. వారికి హౌస్ మాస్టర్, డిప్యూటీ వార్డెన్ తదితర విధులతో బోధన కంటే బోధనేతర పనులే అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు సాధిస్తూ చిరకాలం మనగలగాలంటే ఉపాధ్యాయులను ఒత్తిడికి దూరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధనేతర విధులను తగ్గించాలనీ, పాఠశాలలకు శాశ్వత వసతి కల్పించాలని సూచించారు. పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయులకు నివాస వసతి కల్పించాలని తెలిపారు. అప్పటివరకు పనివేళల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.