Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖకు టీఎస్జీసీసీఎల్ఏ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించి టోకెన్ నెంబర్ వచ్చిన జిల్లాలకు వెంటనే వేతనాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలకు సంబంధించి కమిషనర్ ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే ఆయా డ్రాయింగ్ ఆఫీసర్లు బిల్లులు చేసి జిల్లా కోశాధికారులకు సమర్పించారని తెలిపారు. దీనికి సంబంధించి టోకెన్ నెంబర్లు వచ్చి ఈ కుబేరులోకి వాటిని పంపారని వివరించారు. అయినా ఆర్థిక శాఖ అనుమతి ఉంటేనే వేతనాలు కాంట్రాక్టు అధ్యాపకులకు అందుతాయని వివరించారు. క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం సందర్భంలో కుటుంబ ఖర్చుల నిమిత్తం వేతనాలు అందకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అందువల్ల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు టోకెన్ నెంబర్లు ఇచ్చిన జిల్లాలకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.