Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి), న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు సిట్ సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసులపై విధించిన స్టేను హైకోర్టు ఈ నెల 30వరకు పొడిగించింది. స్టే ఆదేశాల గడువు ముగియడంతో గురువారం జస్టిస్ సురేందర్ పొడిగింపు ఉత్తర్వులు విడుదల చేశారు. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ ఇతరులకు సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై గత నెల 25న కోర్టు స్టే విధించింది. తర్వాత పొడిగిస్తూ వస్తోంది. వాళ్లకు ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులపై కూడా స్టే ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తునకు అనుమతి.. అరెస్టులకు నిరాకరణ
మాదాపూర్‌లో 'కాంగ్రెస్ వార్' వ్యవహారంపై పోలీసుల దర్యాప్తునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ అరెస్టు చేయోద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఇషాన్ శర్మ, విశాఖపట్నానికి చెందిన తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన ఎంఎస్ ప్రతాప్‌లను అరెస్టు చేయోద్దంటూ హైకోర్టు గురువారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వారికి పోలీసులు ఇచ్చిన 41 ఎ నోటీసులతోపాటు కేసు దర్యాప్తును కూడా నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
యథాతథస్థితిలో ఉంచాలి
బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్ హౌస్ ఉన్న 3,500 గజాల స్థలం వ్యవహారంపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అత్యంత విలువైన ఆ స్థలం విషయంలో అన్ని కోర్టులు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా ఆ స్థలం తమదేనని ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ వి. చంద్ర రేఖ, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ప్రభుత్వ భూమేనని సర్కారు వాదించింది. పిటిషనర్లు చెబుతున్న భూమికి అక్కడున్న భూమికి, సంబంధం లేదని అవి వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్నాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారు. భూములని చెప్పారు. వేరే సర్వే నెంబర్ భూమిపై సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు పొందిన పిటిషనర్ అది గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్ హౌస్ భూమిదేనని చెప్పడం సరికాదని చెప్పింది. వాదనల తర్వాత హైకోర్టు యథాతథస్థితికి ఉత్తర్వులు జారీ చేసి విచారణను జనవరికి వాయిదా వేసింది.