Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల ఐక్యత పెరగాలి
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ... : సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల ప్రదర్శన జయప్రదం చేసేందుకుగానూ క్షేత్రస్థాయికెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు ఆ యూనియన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని మల్లు స్వరాజ్యం నగర్లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభనుద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రంలో కార్పొరేట్ల, మతోన్మాద అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉందని విమర్శించారు. సంపద సృష్టికర్తలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలేనని చెప్పారు. అయితే, సంపద వారికి దక్కకుండా కార్పొరేట్ల వద్ద పోగవుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే సమయంలో నయాఉదారవాద, విచ్ఛిన్నకర విధానాలను వేగంగా తీసుకొస్తున్న తీరును వివరించారు. ఈ విధానాల వల్లనే దేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక, ఆర్థిక అసమానతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు వేగంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇటీవల పోరాటాలు ఉధృతం అవుతున్నాయని చెప్పారు. అయితే, ఈ అంశాలపై విడివిడిగా జరుగుతున్న పోరాటాలు పాలకుల కండ్లు తెరిపించలేకపోతున్న నేపథ్యంలో ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు ఏవిధంగా నష్టపోతున్నారనే అంశాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఉందనీ, దాన్ని సీఐటీయూ నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.