Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రబాబుపై విమర్శలు సరికాదు
- పరేడ్‌గ్రౌండ్స్‌లో సింహగర్జన పెడతా : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం వాస్తవాలు చెబుతుంటే ఎందుకు భయ పడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకత్వా న్ని ప్రశ్నించారు. ఖమ్మం శంఖారావం సభలో గతంలో టీడీపీ చేసిన పనులనే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చెప్పారనీ, మీ మీద విమర్శలు చేయలేదు కదా ? అని వ్యాఖ్యానించారు. ఒక్క మీటింగ్‌కే ఎందుకంత భయం ? ఇక ముందు మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా సభలు పెట్టనున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతాం, ముందు ముందు సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో కూడా మీటింగ్‌లు పెడతామని అన్నారు. తెలుగుదేశం నుంచి నాయకులు మాత్రమే వెళ్లారనీ, కార్యకర్తలు కాదని అన్నారు. ఖమ్మం బహిరంగ సభ ద్వారా టీడీపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి బయటపడిందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత సభకు రావడం సంతోషంగా ఉందన్నారు. తండోపతండాలు వచ్చి సభను విజయవంతం చేసినందుకుగాను రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నట్టు చెప్పారు. చంద్రబాబు సభను విజయవంతం చేసిన పార్టీ నాయకత్వానికి, ఖమ్మం జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి భారీగా జనం తరలివచ్చారని పేర్కొన్నారు. సభలు పెట్టేది కాసాని జ్ఞానేశ్వర్, మా అధ్యక్షుడిని నేనే పిలుచుకున్నా అని స్పష్టం చేశారు. అందరం ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లమే, ఈ క్లాస్‌లో చదివినవాళ్లమేనని గుర్తు చేశారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెబుతామనీ, ప్రజల తరపున మాట్లాడతాం, కొట్లాడతామని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగింది చంద్రబాబు వల్లేనని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పలేదా ? కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. మరి ఎందుకంత రాద్ధాంతం అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పనులనే చెప్పాడనీ, చేయనివి కాదని అన్నారు. ఒకవేళ మీరు చేయలేదని చెబుతారా ? అని సవాల్ విసిరారు. ఖమ్మం సభ ఆరంభమేననీ, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సింహగర్జన పెడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు లోకల్ స్టాండ్ లేదనీ, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయ్యాకా ? ఇంకేముంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లల్లో ఢంకా భజాయిస్తామని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయరాదని అనుకున్నామనీ, వచ్చే సాధారణ ఎన్నికల కోసమే సిద్ధమవుతున్నామని చెప్పారు. పేద ప్రజలు తమ సమస్యలపై పెట్టుకున్న 28 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు. విలేకర్ల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, సీనియర్ నాయకులు కాట్రగడ్డ ప్రసూన, అట్లూరి సుబ్బారావు, రఘు తదితరులు పాల్గొన్నారు.