Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీభవన్‌లో తోపులాట
- అనిల్‌పై ఓయూ విద్యార్థి నేతల దాడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గాంధీభవన్‌లో రచ్చ...రచ్చ అయింది. మాట, మాట పెరిగి తోపులాటకు దారి తీసింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల మాజీ విప్ ఈ అనిల్ పార్టీ సీనియర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం దిగ్విజరుసింగ్తో భేటీ అనంతరం గాంధీభవన్ నుంచి అనిల్ బయటకు వస్తున్న క్రమంలో ఆయనపై ఓయు విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామనీ, అయినా, కమిటీల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సేవ్ కాంగ్రెస్ అంటూ పదవులు రాని నేతలు నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ను బూతులు తిడుతూ ఓయూ కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారు. ఉత్తమ్‌ను తిడతావా అంటూ అనిల్‌పై మండిపడ్డారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ జంబో కమిటటీపై వస్తున్న విమర్శలకు అనిల్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఉత్తమ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిగ్విజరు సింగ్ ముందే నేతలు గల్లాలు పట్టుకున్నారు. సమావేశం నుంచి కొందరు నేతలు బయటకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఘర్షణపై అధిష్టానం సీరియస్
గాంధీభవన్ దగ్గర ఘర్షణపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఘటనపై మాణిక్కం ఠాగూర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయకులు తీరు మార్చుకోవాలంటూ దిగ్విజరు సూచించారు. కొందరు తనపై దాడికి యత్నించారని అనిల్ ఫిర్యాదు చేశారు. దాడి ఘటనను అనిల్, దిగ్విజరుసింగ్ తదితరులు మాణిక్కం ఠాగూర్ దష్టికి తీసుకువెళ్లారు.