Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షోభంలో విద్యా వ్యవస్థ
- ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్పులను విడుదల చేయని వైనం : పీడీఎస్యూ ఇష్టాగోష్టిలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజ వికాసానికి విద్య ఎంతగానో తోడ్పడుతుందనీ, అలాంటి ప్రాముఖ్యత కలిగిన విద్యా వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెట్టటమే గాకుండా..విద్యలో మనువాద భావాజాలాన్ని జొప్పించారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేశ్ అధ్యక్షతన 'ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్పుల'అంశంపై బిగ్డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ.3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్పులను ఎందుకు విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, నూతన విద్యావిధానం పేరుతో మనువాద భావాజాలాన్ని జొప్పిస్తున్నదని తెలిపారు.వెనుకబడ్డ తరగతులకు చదువే అవసరం లేదని మనువాదం చెబుతుందనీ, ఆ విధానాన్ని ఇప్పుడు కొనసాగించాలని చూడటం దుర్మార్గమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విద్య ద్వారానే సామాజిక మార్పు వస్తుందని స్పష్టం చేశారు. హెచ్సీయూ ప్రొఫెసర్ కెవై రత్నం, ప్రొఫెసర్ డి.పాపారావు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్పులు, రియంబర్స్ మెంట్,ఫెలోషిప్పులు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారం భరించలేక అనేకమంది ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వారం రోజుల అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తుందనీ, అలాంటప్పుడు ఫీజు బకాయిల విడుదలకు నిధులెవ్వా అని ప్రశ్నించారు. పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు ఎస్.వి.శ్రీకాంత్, పుట్ట లక్ష్మన్, ఎఐడీఎస్ఒ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, ప్రయివేటు డిగ్రీ ,జూనియర్ అసోసియేషన్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, శ్రావణ్ తదితరులు ఈ డిబేట్లో మాట్లాడారు. కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్, తదితరులు పాల్గొన్నారు.