Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భౌతికకాయానికి చెరుపల్లి నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్య గుప్తా మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సానుభూతిని తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన కుమారుని ఇంట్లో మల్లయ్య గుప్తా భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గురువారం సందర్శించి నివాళులర్పించారు. భువనగిరిలో జన్మించిన మల్లయ్య గుప్తా ఆంధ్ర మహాసభ ఉద్యమానికి ఆకర్షితులై కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పనిచేశారని తెలిపారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అనేక కేసులను ఎదుర్కొన్నారని వివరించారు. జైలు జీవితం గడిపారనీ, తెలంగాణ విమోచనం తర్వాత భువనగిరి పురపాలక సంఘానికి తొలి చైర్మెన్‌గా ఆయన ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు.
సీపీఐ దిగ్భ్రాంతి
తెలంగాణ సాయుధ పోరాట యోధులు జైని మల్లయ్య గుప్తా మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన నిబద్ధతగల కమ్యూనిస్టు నాయకుడని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో కమ్యూనిస్టు పార్టీలో చేరి చివరి వరకూ పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సమరయోధులు జైని మల్లయ్య గుప్తా నిబద్ధతకు మారుపేరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. చివరి వరకూ కమ్యూనిస్టు పార్టీ పట్ల అంకితభావంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక భవనం స్వాధీనం చేసుకోవాలంటూ నిరవధిక దీక్షకు సైతం సిద్ధపడ్డారని గుర్తు చేశారు. ఆయన ఆశయాన్ని సాధించేందుకు సన్నద్ధమవుదామని తెలిపారు. ఈనాటి తరానికి ఆయన జీవితం ఆదర్శమని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. భువనగిరిలోని ఇల్లును పార్టీ కార్యాలయానికి ఇచ్చిన గొప్ప త్యాగశీలి అని ఆయన సేవలను కొనియాడారు. మల్లయ్య గుప్తా మరణం బాధాకరమని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయనతో తనకు 50 ఏండ్ల అనుబంధముందని వివరించారు. తెలంగాణ అమరవీరుల ట్రస్టు సమావేశాలకు గుప్తా హాజరయ్యేవారని పేర్కొన్నారు.
పలువురి నివాళి
జైని మల్లయ్య గుప్తా భౌతికకాయాన్ని సీపీఐ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసంహరెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్, ప్రజాపక్షం సంపాదకులు కె శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త ఎస్వి సత్యనారాయణ, తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.