Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు విరివిగా రుణాలివ్వాలి
- నాబార్డు సమావేశంలో మంత్రి హరీశ్ రావు
- వచ్చే వారం రైతుబంధు పంపిణీ
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగుకు మద్దతునిస్తుందని.. ఇందుకు సంబంధించి రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళిక సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరిసాగు భారీగా పెరుగుతున్నదనీ, దీంతో కూలీల సమస్య పెరిగి రైతుకు పెట్టుబడి భారం అధికమవుతుందన్నారు. దీన్ని నివారించేందుకు గానూ వరిసాగులో నాట్లు వేసేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలను అందించాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డ్‌ను కోరారు. ఇది పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడంతో పాటు రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక పథకాలకు రుణ సహాయం చేసిన నాబార్డ్ ముందు సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి తొందరగా అనుమతి ఇవ్వాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతలను కోరారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయరంగం దేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో సాగు భూమి, పంటల ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. నాబార్డ్‌తో కలిసి ప్రభుత్వం ఎన్నో అభివద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, అదే విధంగా ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు చేరిందని మంత్రి తెలిపారు. అదే విధంగా అవసరమైన ఎరువులను ముందుగానే తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేయడం వల్ల రైతులకు సరైన సమయంలో ఎరువులను అందిస్తున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలో ఎరువుల కోసం క్యూలైన్లలో ఉండి రైతులు చనిపోయిన ఘటనలు చూస్తున్నామన్నారు.
28 నుంచి రైతు బంధు సాయం
రైతుబంధు పథకానికి ఇప్పటి వరకు తొమ్మిడి విడతల్లో రూ. 57882 కోట్లు ఖర్చు చేశామని, ఈ నెల 28 నుంచి 10 విడత పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా కాలంలో తమ జీతాలు నిలిపామే తప్పా.. రైతులకు అందించే రైతుబంధును మాత్రం సమయానికి అందించామన్నారు.
యాంత్రీకరణకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గతంలో రాష్ట్రంలో 94వేల ట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 3.52 లక్షలకు పెరిగిందన్నారు. ఉచిత విద్యుత్ కోసం ప్రతి రైతుపై రూ.18వేలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతియేట రైతుల తరుపున ప్రతియేట రూ. 11,500 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్టు తెలిపారు.