Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కల్లాల కోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. పంట కల్లాలను కడితే కేంద్రానికి ఎందుకు కడుపు మంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత కోసం కల్లాలు నిర్మిస్తే మోడీ సర్కారు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు. రైతులకు అత్యంత ఉపయోగ పడే వ్యవసాయ కల్లాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని పేర్కొ న్నారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందని తెలిపారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యం తరం చెప్పని మోడీ సర్కారు తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ప్రశ్నించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏండ్ల నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్షకట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ మతిలేని, కుట్రపూరిత చర్యలపై శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు.