Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీలు, కాలేజీలు, హాస్టళ్లు, కోచింగ్ కేంద్రాలపై కేంద్రీకరణ
- పిల్లలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యం
- సైబర్ నేరాలు, మత్తుపానీయాలను అరికట్టేందుకు చర్యలు
- అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ క్లబ్‌లు
- పోలీసు, విద్యాశాఖ మధ్య సమన్వయం
- త్వరలో మార్గదర్శకాలు జారీ
- ఉన్నత విద్యామండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యార్థులపై పోలీసుల నిఘా ఉండనుంది. ముఖ్యంగా విద్యార్థులుండే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, హాస్టళ్లు, కోచింగ్ కేంద్రాలపై పోలీసులు కేంద్రీకరణ చేయనున్నారు. ర్యాగింగ్‌తోపాటు సైబర్ నేరాలు, మత్తుపానీయాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే విద్యార్థులకు రక్షణ కల్పించడంతో వారి భవిష్యత్తు ఎంతో ప్రధానం. కాబట్టి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ వంటి అన్ని విద్యాసంస్థలనూ భాగస్వామ్యం చేసి విద్యార్థులు వాటి బారిన పడకుండా చేయాలన్నదే ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ, పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం. అందుకనుగుణంగా పోలీసు, విద్యాశాఖ మధ్య సమన్వయం పెరగాలనీ, కలిసి పనిచేయాలన్న అభిప్రాయానికి వచ్చాయి. గురువారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యార్థుల భద్రత అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, సైబరాబాద్ సీపీ సివి ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అదనపు డీజీపీలు స్వాతి లక్రా, నాగిరెడ్డి, విజరుకుమార్, మహిళల భద్రత విభాగం డీఐజీ సుమతితోపాటు పలు వర్సిటీల వీసీలు డి రవీందర్, సిహెచ్ గోపాల్‌రెడ్డి, డి రవీందర్ గుప్తా, ఎస్ మల్లేశం, కె సీతారామారావు, జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. 1997లో వచ్చిన ర్యాగింగ్ నిబంధనలు, 2017లో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పిల్లల భద్రతకు సంబంధించిన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల భద్రత, ర్యాగింగ్, సైబర్ నేరాలు, మత్తు పానీయాలు, కుల వివక్ష, వర్ణవివక్ష, లింగ వివక్ష వంటి అంశాలపై చర్చించారు. విదేశాలు, వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్న చట్టాలు, నిబంధనలను పరిశీలించారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తరగతి గదులు, హాస్టళ్లు, మెస్, విశ్వవిద్యాలయం, కళాశాల ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు చర్యలు తీసుకుంటారు. సీసీ కెమెరాలను అమర్చడం, విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అవసరమని భావించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించాలన్న అభిప్రాయానికి వచ్చారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, మత్తు పానీయాలకు అలవాటు పడినా కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో నమ్మకాన్ని కలిగించడమే లక్ష్యంగా పోలీసులు, విద్యాశాఖ అధికారులు కలిసి పనిచేయనున్నారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కూలంకషంగా చర్చించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా త్వరలోనే మార్గదర్శకాలను రూపొందించే అవకాశమున్నది.
విద్యార్థుల రక్షణ ప్రధానం : లింబాద్రి
విద్యార్థుల రక్షణ ప్రధాన అంశమని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. సమావేశానంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, మత్తుపానీయాలకు విద్యార్థులు, యవకులు అలవాటుపడుతున్నారని అన్నారు. వాటిని తీవ్రంగా పరిగణించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేశారు. విద్యాసంస్థల్లో సెమిస్టర్ల వారీగా విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సైబర్ నేరాలు, మత్తుపానీయాలను అరికడతామని చెప్పారు.