Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోడ రాతలు, పోస్టర్లతో ముమ్మర ప్రచారం
- వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాలపై సెమినార్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) జాతీయ మూడో మహాసభలకు ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరబాద్‌లో జరగనున్న నేపథ్యంలో మహాసభల ఆహ్వానసంఘం విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గోడరాతల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ తెలిపారు. మరి కొన్ని ప్రాంతాల్లో గోడరాతలు ప్రారంభించారు. డాక్టర్ భారతీ రావు రిహాబిలిటేషన్ సెంటర్, దేశ్‌ముఖ్ సభలకు వేదిక కానున్న నేపథ్యంలో పరిసర ప్రాతాంల్లో మరింత ఎక్కువగా పోస్టర్లతోపాటు, వివిధ రూపాల్లో అలంకరణ చేస్తున్నారు. ఆహ్వానసంఘం నిర్వహిస్తున్న ప్రచారంతో పాటు ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియా ద్వారా ఎన్పీఆర్డీ లక్ష్యాలను, వికలాంగుల సంక్షేమం కోసం అది చేస్తున్న పోరాట కృషిని వికలాంగులకు మరో మారు తెలియజేస్తున్నారు. విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత అంశాలపై సెమినార్లు నిర్వహిస్తూనే.. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని నీరు గార్చటం కోసం కేంద్రం ఎలా ప్రయత్నాలు చేస్తున్నదో ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో మహాసభల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నది. సుమారు లక్ష కరపత్రాలు, పోస్టర్లు, ప్రతి వికలాంగులకు, ప్రతి ఇంటికి సభల సందేశం అందించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మహాసభల నిర్వహణ కమిటీలు..
మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ఉపకమిటీలను వేసింది. ప్రచార కమిటీ మొద లు.. బహిరంగ సభ, మహాసభలు, ఫుడ్‌కమిటీ కమిటీలను వేసింది. ముఖ్యమైన కార్యకర్తలు ఆయా కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రచార కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తున్నారు.
జాతీయ సదస్సు..
విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం,సాధికారత అంశంపై జాతీయ సదస్సును ఈ నెల 27న దేశ్‌ముఖ్‌లో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్ బిందు, ఎన్పీఆర్డీ జాతీయ అధ్యక్షులు కాంతి గంగూలీ, తెలంగాణ వికలాంగుల కో-అపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ కె వాసుదేవ రెడ్డి,వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలిజ, ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.
ఎన్పీఆర్డీ బహిరంగ సభ
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) మూడో మహాసభల ప్రారంభానికి ముందుగా ఈ నెల 26న ఇందిరాపార్కు వద్ద ఉదయం పది గంటలకు కె వెంకట్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆహ్వాన సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో ఆ సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల చైర్మెన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్, ఎన్పీఆర్డీ కేంద్ర కమిటి సభ్యులు ఎం జనార్ధన్ రెడ్డి, సీహెచ్ సాయమ్మ, అడివయ్య తదితరులు ప్రసంగిస్తారు.