Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెప్పుతో కొట్టుకుంటావా.. తలను గోడకు కొట్టుకుంటావా
- బండి సంజయ్‌కి కూనంనేని సవాల్
- ఇండ్ల స్థలాల కోసం లక్ష మందితో హైదరాబాద్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా... తలను గోడకు కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ హమీలపై స్పందించిన సంజరు కేంద్ర ప్రభుత్వ హామీలపై అదే మాటపై నిలబడతారా అని ప్రశ్నించారు. పేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేదల వ్యతిరేక నిర్ణయాలపై త్వరలోనే లక్ష మందితో హైదరాబాద్ నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 2014, 2019 సాధారణ ఎన్నికలపుడు బీజేపీ అనేక హామీలిచ్చిందని చెప్పారు.
ఏటా రెండు కోట్లు ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందనీ, నల్లధనం వెనక్కి రప్పించి ప్రతి వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామనీ, ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చేస్తామని మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎంత వరకు అమలైందని నిలదీశారు. రాష్ట్రంలో విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.35 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం పట్ల అంత వివక్షత, సవతితల్లి ప్రేమ ఎందుకని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి హమీల్లో కేంద్రం ఏ ఒక్కటైనా అమలు చేసిందా?అని ప్రశ్నించారు. దీనికి బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారనీ, చెప్పుతో కొట్టుకుంటారా? లేదంటే తలను గోడకేసి కొట్టుకుంటారా? అని అడిగారు. ఎనిమిదేండ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిందా?అని ప్రశ్నించారు. మోడీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నారనీ, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారనీ, లొంగదీసుకు నేందుకు ఈడీ, సీబీఐతో బెదిరిస్తున్నారని విమర్శిం చారు. న్యాయవ్యవస్థను కూడా కేంద్రం నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. బిల్కీస్ బానో ఘటనలో జీవితఖైదీ పడిన దోషుల విడుదలకు న్యాయస్థానంపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందన్నారు. బీజేపీ నిరంకుశంగా, నియంతృ త్వంగా పాలన సాగిస్తున్నదని విమర్శించారు. మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు 28 సార్లు ఉందంటూ బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అమిత్‌షా పేరు వందసార్లు ఉన్నదని గుర్తు చేశారు. అమిత్‌షాకు కనీసం నోటీసు ఇచ్చారా?అని కూనంనేని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్‌ను ఎందుకు విచారించడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన రోహిత్ రెడ్డిని ఈడీ విచారించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కరీంనగర్ పేరును కరినగర్, హైదరాబాద్ పేరు భాగ్యనగర్ ఇలా పలు ప్రాంతాల పేర్లు మారుస్తామంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారని అన్నారు. పేర్లు మార్చే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమిత్‌షా పేరు పర్షియన్ భాషకు చెందిందనీ, ఆయనతోపాటు బీజేపీకి చెందిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ పేర్లను కూడా మారుస్తారా?అని అడిగారు. దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్ల పేర్లను కూడా మారుస్తారా, అలా చేస్తే విదేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్, తాజ్‌మహల్, ఎర్రకోట వంటి వాటిని కూలగొడతారా? అని ప్రశ్నించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ న్యాయమూర్తుల ఎంపికకు కొలిజీయం విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొందరు దీన్ని వ్యతిరేకిస్తూ వినతులు సమర్పించారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ వెల్లడించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు.