Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాముని సన్నిధికి రాష్ట్రపతి
- పర్యటనపై జోరుగా చర్చలు
- భద్రాద్రి నుంచే కమలనాధుల పావులు
- గులాబీ దళపతికి సవాలా..?
- రాష్ట్రపతి పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్న స్థానికులు
- భద్రాచలానికి మేలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
అలనాటి పాల్వంచ పరగణ తహసీల్దార్ కంచర్ల గోపన్న సృష్టి భద్రాచలం రామాలయం. తానీషా సైతం చక్కని సంప్రదాయంతో భద్రాద్రి రామున్ని ఆరాధించారు. గత వైభవం ఎంతో చిరస్మరణీయం. కానీ ప్రస్తుతం భద్రాచలం క్షేత్ర ప్రగతి ప్రశ్నార్ధకంగానే మిగిలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమకు నోచుకోక భద్రాచలం విలవిలలాడుతోంది. ముంపు విభజనతో భద్రాచలం తప్ప దాని పక్కనున్న ప్రాంతమంతా ఆంధ్రాలో కలిసిపోవడంతో అభివృద్ధికి నోచుకోక దిక్కుతోచని స్థితిలో భద్రగిరి కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం చెల్లాచెదురయింది. పార్లమెంట్ రూపమే పోయింది. చివరికి పట్టణం కాస్త ముక్కలైంది. ఇంత జరిగినా, జరుగుతున్నా పవిత్ర నేల పరిరక్షణకై పాలకులు నేటికీ పట్టించుకోకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
రాముని సన్నిధికి రాష్ట్రపతి
తెలంగాణలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 28న భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10:40 నిమిషాలకు రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం వచ్చి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు. అనంతరం
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకాన్ని భద్రాచలం నుంచి వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అనంతరం ములుగు జిల్లా రామప్పకు తరలి వెళ్తారు. భద్రాచలం పట్టణానికి గతంలో ఇద్దరు రాష్ట్రపతులు వచ్చారు. 1965లో భారత తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ భద్రాచలంలో ఆనాడు నిర్మించిన బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేశారు. తదుపరి 1982లో నాటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా ఇటీవల కాలంలో వ్యవహారం తారాస్థాయికి చేరుకోవటంతో రాష్ట్రపతి పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన కమల నాధుల సెంటిమెంటా..? లేక దీని వెనుక భారీ స్కెచ్ ఏమైనా ఉందా అంటూ...? ప్రశ్నల పరంపర తలెత్తుతోంది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కమలనాధులు పావులు కదుపుతు న్నారు అన్న ప్రచారం వేడెక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో 2015 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణానికి హాజరయ్యారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణానికి రాకుండా మంత్రులనే పంపిస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై రాజకీయ పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. అయితే ఇటీవల వరదల నేపథ్యంలో సీఎం భద్రాచలం వచ్చారు. కానీ భద్రాద్రి రామున్ని మాత్రం దర్శించలేదు. సీఎం భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులతో పాటు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున గళం విప్పాయి. అదే క్రమంలో బీజేపీపై స్థానికులు మండిపడుతున్నారు.
భద్రాచలంలో ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రా నుంచి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో కలపాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్‌ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెడచెవున పడుతూ వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగడం లేదనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉండగా భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా చీలుస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా పెద్ద ఎత్తున దుమారమే రేగింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి భద్రాచలం పట్టణాన్ని విభజించకుండా మేజర్ గ్రామపంచాయతీగానే ఉంచి ఎన్నికలు నిర్వహించాలని నినదించారు.
పర్యటనపై జోరుగా చర్చలు
భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటనపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కావాలనే ఈ పర్యటన ఇక్కడ ఖరారు చేశారని పలువురు పేర్కొంటున్నారు. కమల నాధులు ఇక్కడినుంచి పావులు కదిపి లబ్ధి పొందాలని ఈ పర్యటనను పొలిటికల్ సెంటిమెంట్‌గా వాడుకోవాలని తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే హడావుడిగా పర్యటనను ఖరారు చేసి అభివృద్ధి పేరుతో శంకుస్థాపనలు సైతం చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు ప్రచారంలో ఉంది. తెలంగాణ సీఎం ఇక్కడికి రాని వైనంను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాష్ట్రపతి పర్యటనతో ఇది ప్రజల చెంతకు తీసుకెళ్లాలనే భారీ వ్యూహమే అమలు చేస్తున్నారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే కమల నాధులు పావులు కలిపి గులాబీ దళపతికి సవాల్ విసురుతున్నారని ప్రచారంలో ఉంది. అయితే రాష్ట్రపతి పర్యటనపై స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. పెద్దల పగలు భద్రాద్రికి ఏమైనా కలిసివచ్చేనా...? ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలం పరమవుతాయా..? భద్రాచలం అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందా? సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్ల నిధులు వచ్చి పడతాయా...? పోలవరం ముంపు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సుందర భద్రాద్రి ప్రగతి సాధ్యమవుతుందా...? అని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇదిలా ఉండగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భద్రాచలంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భద్రాద్రి ప్రగతి అంశం చర్చించి, రాష్ట్రపతికి నివేదించాలని స్థానిక నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. మరి పాలకుల వైఖరి అంతిమంగా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.