Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ పథకంతో 66 లక్షల మంది రైతులకు లబ్ది : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు బంధు పథకం ద్వారా తమ ప్రభుత్వం అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకూ మొత్తం తొమ్మిది విడతల్లో రూ.57,882 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. పదో విడతలో భాగంగా ఈనెలాఖరులో రూ.7,600 కోట్లను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రైతులతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షన్నర మంది అన్నదాతలతో ఆయన సంభాషించారు. రైతు బంధు ద్వారా రాష్ట్రంలోని 66 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంతోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి స్కీములనే అమలు చేస్తున్నాయని తెలిపారు.
వారాల ఆనంద్కు అభినందనలు...
కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అనువాద పురస్కారం పొందిన వారాల ఆనంద్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ భావకవి గుల్జార్ 58 కవితలను 'ఆకుపచ్చ కవితలు' పేరిట తెలుగులోకి అనువదించినందుకు గాను ఆనంద్కు ఈ పురస్కారం దక్కటం హర్షణీయమని పేర్కొన్నారు.