Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అనీ, ఇంధన వినియోగాన్ని పొదుపుగా వాడి, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో అందరూ భాగస్వాములు కావాలని రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హౌటల్లో రెడ్కో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (ఈఈఎస్ఎల్) సహకారంతో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేస్తున్నామన్నారు. పరిశ్రమలు కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ, 2050 నాటికి నెట్ జీరో కంపెనీలుగా మారాలని చెప్పారు. ఈఈఎస్ఎల్ ఏజీఎం అజరు రాజ్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన ప్యాట్ స్కీంను పరిశ్రమలు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. నిర్దేశిత సమయంలో ఇంధన వినియోగ పత్రాలు అందజేయాలన్నారు. లేకుంటే అపరాద రుసుము చెల్లించాల్సి వస్తుందన్నారు. లక్ష్యాన్ని చేరుకున్న వారికి ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ అందజేస్తామన్నారు. కార్యక్రమానికి థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్, పేపర్, పల్ప్, ఐరన్ అండ్ స్టీల్, టెక్స్టైల్, డిస్కంలు, రైల్వే, హౌటల్ రంగానికి చెందిన 39 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రెడ్కో డీజీఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.