Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాన్స్‌లర్ గవర్నర్, డాక్టర్ తమిళి సై సౌందరరాజన్
- కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం
నవ తెలంగాణ-ములుగు
'దేశ సంస్కృతిలో భాగమైన పండ్లు, కూరగాయలు, పూలు.. లాంటి ఔషధ పంటలపై పరిశోధనలు విస్తతం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులు వ్యవసాయం, ఉద్యాన కోర్సులను ఎంచుకోవడం ద్వారా దేశానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలన్నారు. సమతుల ఆహారంలో కూరగాయలు, పండ్లు ముఖ్యమన్నారు. కోవిడ్ సమయంలో పౌష్టికాహారం గురించి ఎన్నో నేర్చుకున్నామని గుర్తుచేశారు. అందమైన వనాల రూపకల్పనలో ఉద్యాన పట్టభద్రుల కృషి అవసరమన్నారు. ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్, ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తుందన్నారు. తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నాయని, తెలుగు నేలపై పాలిష్ రైస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం భారత వ్యవసాయ పరిశోధన మండలి హార్టికల్చరల్ సైన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆనంద్ కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ ఉద్యాన పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికత భాగస్వామ్యం అవసరమని చెప్పారు. మార్కెట్ ఉన్న పంటల సాగు చేయడం, కోతానంతరం వ్యవసాయ నష్టాలను తగ్గించడంతో పాటు రోబోటిక్స్, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీనోమ్ ఎడిటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించు కోవాలని చెప్పారు. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడమే లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు ముమ్మరం కావాలని కోరారు. వర్సిటీ అభివృద్ధి నివేదికను యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ నీరజ ప్రభాకర్ నివేదించారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అనతికాలంలోనే విద్యా, పరిశోధన, విస్తరణలో అనేక విజయాలు సాధించిందన్నారు. భవిష్యత్తులో రైతులకు నికర లాభాలు అందించే పరిశోధనలు, టెక్నాలజీల అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉప కులపతిగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.