Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
- కేంద్రం, ప్రధాని దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
ఉపాధి హామీ చట్టం నిధులతో తెలంగాణ ప్రభుత్వం పంట ఆరబోత కల్లాలు నిర్మించడంపై కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై కేంద్రం కక్షపూరిత విధానాలను నిరసిస్తూ ధర్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అలాగే, వ్యవసాయానికి ఉపాధిహామీ చట్టాన్ని అనుసంధానించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.
కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాణిజ్యభవన్ వద్ద రైతు మహాధర్నా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
ఉపాధి హామీకి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేశారు. సాగర్ రహదారిపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
బీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నదాతలతో కలిసి మేడ్చల్ పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.