Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వంసమైన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు
- పడిపోయిన బస్తీ మార్కెట్ కూరగాయలు, పలువురికి గాయాలు
- సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి తలసాని, ఏసీపీ
నవతెలంగాణ - ధూల్‌పేట్
హైదరాబాద్‌లోని గోషామహల్ చాక్నవాడిలో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పెద్ద నాలా పైకప్పు కుంగిపోవడంతో రోడ్డు పక్కన, ఇండ్ల ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు అందులోకి పడిపోయాయి. ప్రతి శుక్రవారం అక్కడ కూర గాయల అంగడి కొనసాగుతున్నది. కూరగాయల వ్యాపారులు అప్పుడప్పు డే అక్కడకు చేరుకుంటుండగా.. కొందరేమో కూరగాయల బండ్లను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నాలా కుంగి పోయింది. కూర గాయలు దొర్లిపోవడం పాటు పలువురు పడిపోవడంతో వారికి గాయాల య్యాయి. అయితే, రద్దీ తక్కువగా ఉండటంతో ప్రాణహాని జరగలేదు. ఎన్నో ఏండ్ల నిర్మాణం గల నాలాపై ఉన్న రోడ్డు కుంగి పోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాలాలను వదలకుండా ఆక్రమిం చుకుంటున్న వైనం, మరోపక్క నాలాలపైనే నిర్మాణాలు కొనసాగించడం.. భారీ వాహనాల లోడింగ్‌లు, అన్లోడింగ్లే నాలా కుంగిపోవడానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న షాహినాయత్ గంజి ఇన్స్పెక్టర్ అజరు కుమార్ సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మార్కెట్‌కు వచ్చే జనాలను, స్థానికులను అక్కడి నుంచి తరలిం చారు. గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో బందో బస్తు నిర్వహించారు. స్థానికంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు
నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే..మంత్రి తలసాని
నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చాక్నావాడిలో ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. జనసంద్రం తక్కువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్య కారణం అక్రమ గోడౌన్లు
జాంబాగ్ డివిజన్ బీఅర్ఎస్ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్ గౌడ్
నాలాపై రోడ్డు కుంగిపోవడానికి ముఖ్య కారణం అక్రమ గోడౌన్ల నిర్మాణమేనని బీఆర్ఎస్ జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతిరోజూ ఇక్కడికి పెద్ద పెద్ద లారీలు ఎక్కువ లోడ్‌తో తిరుగుతున్నాయన్నారు. ఇక్కడ ఫ్లైవుడ్ బండ్లు, వివిధ మెటీరియల్ బండ్లు రోజుకు 10 నుంచి 25 చొప్పున అన్లోడ్ అవుతున్నాయని చెప్పారు. 40 సంవత్సరాల కింద వేసిన రోడ్డు కావడం.. లారీల రాకపోకలు ఎక్కువవడంతో రోడ్డు కుంగిపోయిందన్నారు. అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడంతో వీళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.