Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నాలుగేండ్లలో 3వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
- బహుముఖ వ్యాపార విస్తరణ
- ఈ ఏడాది లాభాలు రూ.2వేల కోట్లకు పైనే...
- ఆవిర్భావ దినోత్సవంలో సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరో వందేండ్లపాటు సింగరేణి కాలరీస్ సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని ఆ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ అన్నారు. 13 దశాబ్దాలుగా ఈ సంస్థ దేశ సేవకు అంకితమై పనిచేస్తున్నదన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో ధీటుగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తితో సంస్థ సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతుందని చెప్పారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సంస్థకు మహర్దశ కలిగిందన్నారు. బొగ్గు ఉత్పత్తిని 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెంచుకోవడం, టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్లకు పెంచుకోగలి గామన్నారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని తెలిపారు. సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతం పైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించి దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాయిని అధిగమించి జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ పనితీరును చూసే సీఎం కేసీఆర్ ఇక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయమని ఆదేశించారనీ, దీనికోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించి, మార్చి నుంచి పనులు మొదలు పెట్టనున్నట్టు వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందన్నారు. ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్మికులు, ఉద్యోగులు పూర్తి పనిగంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తి శాతం వినియోగిస్తూ ఉత్పాదకతను పెంచాలనీ, అప్పుడే పోటీ మార్కెట్లో నిలబడగలమని దిశానిర్దేశం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో తొలుత ఆయన సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు డీజీఎం(ఐటీ) గడ్డం హరి ప్రసాద్, ఎస్వోఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వైజర్(మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్) కె.సూర్య నారాయణ, సీఎంవోఏఐ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈసంద ర్భంగా జరిగిన పలు సాస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంస్థ నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందచేశారు.