Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కైకాల మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- గవర్నర్, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల సంతాపం
- సినీ రంగానికి తీరని లోటు : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తన వైవిధ్యమైన నటనతో ఆయన సినీ అభిమానుల హృదయాల్లో నవరస నట సార్వభౌముడిగా చెరగని ముద్ర వేశారని తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషించిన ఆయన... మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని స్మరించుకున్నారు. సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నటుడిగా, లోక్‌సభ సభ్యుడిగా ఆయన అందించిన కళాసేవ, ప్రజాసేవ గొప్పదని కొనియాడారు. కైకాల మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కైకాల ఇంటికి వెళ్లిన కేసీఆర్... ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి... వారికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కైకాల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం వెంట కైకాల నివాసానికి వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్ తదితరులు కూడా సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ కైకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని నివాళులర్పించారు. సుమారు 60 ఏండ్ల పాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తనదైన నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కైకాల మరణం సినీ రంగానికి తీరని లోటని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన గంభీరమైన స్వరం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నదని తెలిపారు. డాక్టరేట్‌తోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న సత్యనారాయణ నటుడిగా, మచిలీపట్నం ఎంపీగా ప్రజలకు సేవలందించారని నివాళులర్పించారు. కైకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ రవిచంద్ర, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు కైకాల మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.