Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేటలో ముగిసిన సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు
- పలు తీర్మానాలకు మహాసభ ఆమోదం
- సిద్దిపేట వీధుల్లో కదంతొక్కిన కార్మికులు
సిద్దిపేట నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సిద్దిపేటలోని మల్లుస్వరాజ్యంనగర్లోని సున్నం రాజయ్య ప్రాంగణం(రెడ్డి ఫంక్షన్‌హాల్) సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ఉత్సాహంగా..కార్మికులను చైతన్యపరిచేలా జరిగాయి. ప్రతినిధుల్లో పోరాట చైతన్యం నింపేలా సీఐటీయూకి సేవలందించిన అమరుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. దేశంలో కార్మికవర్గంపై తీవ్ర నిర్బంధం పెరుగుతున్న తరుణంలో, మరోవైపు మతోన్మాదం బుసలుగొడుతూ ముందుకొస్తున్న వేళలో ఎలా ముందుకు సాగాలనే విషయంపై మహాసభ దిశానిర్దేశం చేసింది. ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని ఐక్యపోరాటాల రూపకల్పన ఎలా చేయాలనే అంశంపై జాతీయ నాయకత్వం మార్గనిర్దేశం చేసింది. సీఐటీయూ అఖిల భారత కేంద్రం నుంచి అధ్యక్షులు హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మూడు రోజుల పాటు అక్కడే మహాసభ చర్చలు, భవిష్యత్ కార్యాచరణ, తదితరాలను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన ప్రారంభమైన మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నివేదికను ప్రవేశపెట్టారు. గత మహాసభ నుంచి ఇప్పటివరకూ ఆయా పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను, మరణించిన యోధులను, ఆయా రంగాల ప్రముఖులను మహాసభ స్మరించుకున్నది. పలు తీర్మానాలను ఆమోదించింది. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో వస్తున్న పోరాటాలను అణచివేసేందుకు గానూ మతోన్మాదాన్ని తెరపైకి తెస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించింది. కార్మికులు ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా రాజకీయంగా చైతన్యపరిచేలా పోరాటాలను రూపకల్పన చేయాలని నిర్ణయించింది. భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా మహాసభ నిర్ణయాలు నిలువనున్నాయి. రాష్ట్రంలో 75 షెడ్యూల్ ఎంప్లాయింట్స్ జీవోలను రాష్ట్ర సర్కారు విడుదల చేసేలా పోరాటాలను దశలవారీగా చేయాలని నిర్ణయించింది. చివరిరోజు సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన కార్మికుల మహాప్రదర్శన కొత్తఊపును తెచ్చింది. ప్రదర్శన ముందుభాగంలో జాతీయ, రాష్ట్ర నాయకత్వం నడిచింది. సంఘటిత, అసంఘటిత కార్మిక శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. కార్మిక, కర్షకుల ఐక్యత వర్థిలాలి ..సీఐటీయూ జిందాబాద్...నినాదాలతో సిద్టిపేట పట్టణం దద్దరిల్లింది. బహిరంగ సభలో కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి సందేశాన్ని ఇచ్చారు. సిద్దిపేటలో మూడు రోజుల పాటు జరిగిన మహాసభలో ప్రతినిధులు చైతన్యాన్ని నింపుకుని భవిష్యత్ కార్యాచరణతో వెళ్లారు.