Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీతో సహా నెల రోజుల్లో జమ చేయాలి
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే బ్యాంకులు వడ్డీ తీసుకోవాలి
- విద్య, గృహ, వ్యవసాయ రుణాలు ఎక్కువగా ఇవ్వాలి
- ఆయిల్ పామ్ విస్తరణకు బ్యాంకులు సహకరించాలి
- ఎస్ఎల్బీసీ సమావేశంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్‌హెచ్‌జీలకు నెలరోజుల్లో తిరిగి చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బ్యాంక్‌లను ఆదేశించారు. అదనంగా లెవీయింగ్ చార్జీలు వేయొద్దని సూచించారు. విద్య, గృహ, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువగా రుణాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పామ్ ఆయిల్ విస్తరణకు తోడ్పాటు అందించాలన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక బృందాల)ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల ్బీసీ) సమీక్ష సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలు సకాలంలో, పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తూ ఆదర్శం గా ఉన్నాయన్నారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం రూ. 3 లక్షలలోపు రుణాలకు 7 శాతం, రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు 10 శాతం వడ్డీ రేటు అమలు చేయాలని సూచిం చారు. 2022-23కు గానూ అధికంగా వసూలు చేసిన వడ్డీని ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సిపెక్షన్, పోర్ట్ ఫోలియో, నిర్వహణ వంటి సేవల పేరుతో రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకు లు ఎస్‌హెచ్‌జీల రుణాలకు చార్జీలను వసూలు చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. మొబిలైజే షన్, ఇతర సేవలను వీవోలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కాబట్టి బ్యాంకర్లు వడ్డీల్లో కొంత భాగం వీవోలు (విలేజ్ ఆర్గనైజర్లు), ఎంఎస్(మండల సమాఖ్య), జెడ్ఎస్ (జిల్లా సమాఖ్య)లకు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే మెదక్ డీసీసీబీ బ్యాంకు వడ్డిలో ఐదు శాతం ఇచ్చేందుకు ఎంవోయూ కుదు ర్చుకున్నదని చెప్పారు.డెయిరీ, ఫిషరీస్ సంబంధిత రుణ దరఖాస్తులు తిరస్కరించకుండా అర్హులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పామ్ ఆయిల్ సాగుకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డేబశిష్ మిత్రా, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ అమిత్ జింగ్రాన్, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్ చక్రవర్తి, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతు, చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రభుత్వ గ్యారెంటీతో ఎమ్ఎస్ఎమ్ఈ రుణాలు
- అంగీకరించిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు
- కృతజ్ఞతలు తెలిపిన ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు అంగీకరించారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్డీసీ)లో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఎమ్ఎస్ఎమ్ఈకి ప్రభుత్వం నుంచి రావల్సిన ప్రోత్సహాకాలు ఏండ్ల తరబడి ఆలస్యం అవుతున్నాయనీ, వాటి స్థానంలో అంతే మొత్తాలకు ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు మంజూరు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి చేసిన సూచనకు ఆయన వెంటనే అంగీకరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎప్పుడైనా ఇవ్వాల్సిందేననీ, రుణాలు ఇస్తే, దానికి వడ్డీలు మాత్రం తామే కట్టుకుంటామంటూ ఏపీకే రెడ్డి స్పష్టత ఇచ్చారు. అలాగే పలు అంశాలపై ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ చేసిన సలహాలు, సూచనలకు పారిశ్రామిక సంఘాల సమీక్షా సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం బాగా అభివృద్ధి అయ్యిందనీ, నాబార్డు ఇస్తున్న రుణాలను ఎమ్ఎస్ఎమ్ఈకి ప్రోత్సాహకంగా ప్రతి జిల్లాలో వంద ఎకరాలు కేటాయించి, ఇండిస్టియల్ పార్కులు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. దీనికి కూడా మంత్రి హరీశ్‌రావు అంగీకరించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీటిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ సానుకూల ప్రకటన పట్ల ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు.