Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదంపై కవుల కలంపోటు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మనుషుల జీవితాలు ఆ దేశ రాజకీయాలతో ముడిపడి ఉంటాయని ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో సనాతన ధర్మం కాలం నుంచీ ప్రజల మధ్య పరస్పర సహనం ఉన్నదని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ సొంత అజెండాల కోసం కొంతకాలంగా ఓట్‌బ్యాంక్ ద్వారా ప్రజల్ని విడగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన రెండో రోజైన శుక్రవారంనాడు అలిశెట్టి ప్రభాకర్ వేదికపై హిందూ ముస్లిం రచయితలు రాసిన మత సామరస్యంపై సాహిత్య చర్చ జరిగింది. దీనిలో పాల్గొన్న నిఖిలేశ్వర్ మాట్లాడుతూ ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని స్పష్టం చేశారు. ఆర్య, ద్రవిడ, మొఘల్, ఇంగ్లీష్ వారి పాలన సాగినా, ఇక్కడి ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుకున్నారని తెలిపారు. వేలాది సంవత్సరాలుగా దేశంలో సనాతన ధర్మం ఉన్నా, మిశ్రమ సంస్కృతి, ఉమ్మడి బాధ్యత ఉన్నాయని చెప్పారు. ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఉర్దూ, హిందీ, కన్నడ, తెలుగు సహా అనేక భాషా కవులు మత సామరస్యాన్ని త్రివేణీ సంగమంగా గుర్తించారని వివరించారు. కేంద్రంలో నరేంద్రమోడీ, అమిత్‌షా అధికారంలోకి వచ్చాక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందిస్తున్నారనీ, ముస్లిం, క్రిష్టియన్లను అణచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'గీటురాయి' పత్రిక సంపాదకులు అబ్దుల్ వాహెద్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు నాటకీయత అలవాటు లేదనీ, మానవీయత మాత్రమే తెలుసునని చెప్పారు. 'సారే జహాసే అచ్ఛా'య అంటూ సాహిత్యంలో కవులు సర్వమత సామరస్య పంక్తులు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు ఇదే ఐక్యతా చరిత్రను తెలపాలని ఆకాంక్షించారు. యువ కవయిత్రి మెర్సీ మార్గరేట్ మాట్లాడుతూ సహృద్భావంతో కూడిన తన బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ మత సామరస్యం కలుషితం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులు, ముస్లింలకు ఇండ్లు అద్దెకు ఇవ్వట్లేదని ఆందోళన చెందారు. వాట్సాప్‌లో వచ్చే ఉన్మాద మెసేజ్‌లను కనీసం ధృవీకరించుకోకుండా విస్త్రుత ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కే సీతారామారావు మాట్లాడుతూ ప్రజల సహజీవన సంస్కృతికి కొంతకాలంగా ప్రమాదం ముంచుకొస్తున్నదని అన్నారు. పరమతాలే కాదు, స్వమతంలో కూడా అభద్రత, అసహనం పెరుగుతున్నాయని చెప్పారు. దీనిపై మార్పు అనివార్యమనీ, కౌంటర్ ఐడియాలజీ రూపొందించి, మతోన్మాదాన్ని తిప్పికొట్టడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ భిన్నవాదాల్లో చరిత్ర వక్రీకరణను గమనించాలని చెప్పారు. తమ సామరస్య అజెండాను దేశవ్యాప్తంగా విస్త్రుతి చేసేందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక అవుతుందనీ, ఈ ప్రయత్నంలో కవులంతా కలిసి రావాలని కోరారు. కార్యక్రమానికి వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్ అధ్యక్షత వహించారు.