Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కొత్తరకం వైరస్‌పై వివరాలివ్వండి... : కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి సరిపడా కరోనా బూస్టర్ డోసులను సరఫరా చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవి షీల్డ్ 80 వేల డోసులు అందుబాటులో ఉండగా... కోర్బివాక్స్ డోసులు అసలే లేవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతంగా ఉంటే.. తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు. 'కరోనా పరిస్థితులు-రాష్ట్రాల సన్నద్ధత'పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనసుక్ మాండవీయ శుక్రవారం ఢిల్లీ నుంచి రాష్ట్రాల వైద్యశాఖల మంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు... కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బి.ఎఫ్.7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స తదితరాంశాల గురించి రాష్ట్రాలకు తెలపాలని కోరారు. అవి తెలిస్తే ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు వీలవుతుందని అన్నారు.
గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లను సమీప ఆసుపత్రులతో అనుసంధానం చేసేందుకు వీలుగా మ్యాపింగ్ విధానాన్ని తీసుకురావాలన్నారు. వార్షిక నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పిఎస్ఎ ప్లాంట్ల మరమ్మతులను నిర్వహించటం లేదని తెలిపారు. వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని కోరారు. ముంద జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఇ.సి.ఆర్.పి -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3)ని రూపొందించే విషయమై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.