Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.40 వేల కోట్లు కోత విధించిన మోడీ సర్కారు
- అందుకే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నం
- పదోన్నతులు, బదిలీలపై సీఎం సానుకూలం
- విద్యాశాఖలో ఖాళీలన్నీ త్వరలో భర్తీ : ఎస్టీయూటీఎస్ వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు
- న్యాయపరమైన సమస్యల్లేకుండా ప్రమోషన్లు : సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షతను ప్రదర్శిస్తున్నదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని వివరించారు. రెండురోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవ వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న ఎంఈ రెడ్డి గార్డెన్లో ప్రారంభమయ్యాయి. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందంగౌడ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన ప్రారంభసభకు మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎ ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే డి సుధీర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు, నాయకులు బ్రహ్మచారి, బి నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బి రవి, కరుణాకర్‌రెడ్డి, టి పోల్‌రెడ్డి, ఎవి సుధాకర్, దాసరి శ్రీధర్, ఎల్ఎం ప్రసాద్, ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు సాయి శ్రీనివాస్, తిమ్మన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు రావడం లేదంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారని చెప్పారు. 'డబ్బులుండి ఇస్తలేమా?. కావాలని ఆపుతామా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేడేండ్లు ఒకటో తేదీన జీతాలిచ్చింది. ఏడాది కాలంగా ఇబ్బంది వస్తున్నది. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నది. 2.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎఫ్ఆర్బీఎం చట్టప్రకారం రూ.15 వేల కోట్లు కోత పెట్టింది. బోరుమోటార్లకు మీటర్లు పెట్టలేదంటూ రూ.12 వేల కోట్ల నిధులివ్వడం లేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినా రూ.5,300 కోట్లు చెల్లించడం లేదు. జీఎస్టీ బకాయిలివ్వడం లేదు. ఇలా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.40 వేల కోట్ల నిధులను ఆపేసింది. కేంద్రం నిధులు ఆపడం వల్లే జీతాల చెల్లింపులో ఆలస్యమవుతున్నది. వీలైనంత త్వరగా జీతాల సమస్యను పరిష్కరిస్తాం. దేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులే'అని హరీశ్‌రావు అన్నారు. ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కేజీబీవీ, భాషాపండితుల సమస్యను ఏజీతో మాట్లాడి పదోన్నతులు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. విద్యాశాఖలోని ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
మార్కులు, ర్యాంకులే కాదు.. విలువలు నేర్పాలి
'గురువు లేనిదే విద్య లేదు. విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడ ఉండనే ఉండదు' అని హరీశ్‌రావు అన్నారు. ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువు క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. మార్కులు, ర్యాంకులే కాకుండా.. ఉన్నత విలువలు నేర్పించేలా విద్యాబోధన సాగాల్సిన అవసరముందన్నారు.
మంచి విద్యతోపాటు విలువలు, బాధ్యత కలిగిన విద్యార్థులను సమాజానికి అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కేంద్రం మోడల్ స్కూళ్లను రద్దు చేస్తే వాటిని కొనసాగించామని చెప్పారు. అంగన్వాడీల బడ్జెట్‌ను కేంద్రం తగ్గిస్తే వాటి ప్రమాణాలను పెంచి బలోపేతం చేసుకుంటున్నామని వివరించారు. గురుకుల విద్యాసంస్థలను 298 నుంచి 1201కి పెంచుకున్నామని చెప్పారు. గురుకులాలకు బడ్జెట్ రూ.3,250 కోట్లు కేటాయించామన్నారు. గురుకులాల్లో డిగ్రీ, పీజీ, లా కాలేజీ ఉందని అన్నారు. విద్యారంగం, ఇతర శాఖలతో కలిపి విద్యాశాఖకు రూ.25 వేల కోట్ల (పది శాతం) బడ్జెట్‌ను కేటాయించామని వివరించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను అందుబాటు లోకి తీసుకొచ్చామని అన్నారు. అటవీ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు అన్ని రాష్ట్రాలూ, కేంద్రానికి ఆదర్శమని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను కేంద్రం వేరే పేర్లతో అమలు చేస్తున్నదని వివరించారు. గతంలో బెంగాల్ ఏం ఆచరిస్తుందో దేశం అది ఆచరించేదనీ, ఇప్పుడు తెలంగాణ ఏం ఆచరిస్తుందో దేశం అది ఆచరిస్తున్నదని చెప్పారు.
చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరిస్తాం : సబిత
న్యాయపరమైన సమస్యల్లేకుండా పదోన్నతులు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం పెట్టుకోవడం రాజ్యాంగహక్కని చెప్పారు. విద్యాపునాది సరిగ్గా లేకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుందన్నారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర విద్యావిధానాన్ని కేంద్రం రూపొందిస్తే బాగుండేదని అన్నారు.
అయితే అందరూ చదువుకోవడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా మానవీయ విలువలు నేర్పించాలని కోరారు. అత్యున్నత మానవులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమాజానికి చోదకశక్తిగా ఉపాధ్యాయులుండాలని ఆకాంక్షించారు. ప్రశ్నించే గొంతును కేంద్రం నులివేస్తున్నదని చెప్పారు. ప్రశ్నించేతత్వాన్ని చంపేస్తున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ ప్రత్యేక సంచిక వజ్రోద్యమంను మంత్రి హరీశ్‌రావు, డైరీని సబితా ఇంద్రారెడ్డి, జాతిరత్నాలు ప్రత్యేక పుస్తకాన్ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు.