Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ భవిష్యత్ కమ్యూనిస్టులతోనే సాధ్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పోరాడుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ పోరాటాలు చేస్తున్నారని, అందువల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేశామన్నారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేసే సందర్భంలో ప్రజా సమస్యలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. దేశం అభివృద్ధి కావాలంటే అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందన్నారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తుందని తెలిపారు. మండల స్థాయిలో అన్ని రకాల జబ్బులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు కేవలం రూ.236 రోజు కూలి ఇస్తున్నారని, కానీ కేరళ రాష్ట్రంలో రోజు కూలి రూ.830 ఇస్తున్నారని ఇది వాముపక్ష ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. కేరళ రాష్ట్రంలో వరి పంటకు మద్దతు ధర ఎకరాకు రూ.24 వేలు ఇస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు రైతాంగానికి ఈ స్థాయిలో మద్దతు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇతర రాజకీయ పార్టీల నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి లాక్కుంటుందని విమర్శించారు. బీజేపీ విధానాలను ఎండగడుతున్న ఆయా ప్రభుత్వాలపై ఈడీ దాడులకు ఉసిగొలుపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, భూ సమస్యలు, ఇండ్ల స్థలాలు, దళితబంధు తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా డిసెంబర్ 29న జరిగే భారీ బహిరంగసభకు వ్యవసాయ కార్మికులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.