Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవితానుభవాల సారం సాహిత్యం
- సాహిత్యానికి ఎల్లలు లేవు
నవతెలంగాణ:చిలుముల శేఖర్
చినిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కవులు ఊరికే అనలేదు. ప్రతి మనిషికి ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. ప్రతి పుస్తకం ఒక అద్భుతమైన జ్ఞాన బాండాగారం. అలాంటి పుస్తకాలను కొనడం చదవడం అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. పుస్తకాలు జీవితాన్ని ఇస్తాయి. అంతకంటే కష్టాలలో ఉన్న సమయంలో భరోసాని కల్పిస్తాయి. పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ పుస్తకాల జాతర మొదలైంది. పుస్తక ప్రియులను ఎంతగానో ఆకర్షించే ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లు ఏర్పాటుచేశారు. బుక్ ఫేర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేశారు. ఈ పుస్తక నిలయంలో దాదాపు 10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్, ఇతర భారతీయ భాషలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, శాస్త్రీయ సాహిత్యం, నవలలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్ర సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా బుక్ఫెయిర్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నవతెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్టాల్స్ పుస్తక ప్రియులను ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి
అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి....
'అసలు పుస్తకం ఎందుకు చదవాలి' అనే ప్రశ్న వేసేవారు మనలో చాలా మంది ఉంటారు. విద్యార్థి దశలో ఎంతో కష్టపడి చదివి ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో స్థిరపడిపోయిన తరువాత 'ఇక చదువుతో మాకేం పని' అనుకొనే తెలుగువారు కూడా ఎక్కువే. అప్పటి దాకా తెలివిని పంచిన పుస్తకాలు వయసు పెరిగాక ఎలా పనికి రాకుండా పోయాయో అర్థం కాని ప్రశ్నే. నిజానికి పుస్తకం జీవితకాల నేస్తం. ఆ విషయం చదువుతుంటేనే అవగాహనలోకి వస్తుంది.
విద్యాబుద్ధులు నేర్పిన పుస్తకాలు జీవితంలో ఎదురయ్యే చిక్కులకూ పరిష్కారం చూపుతాయి. ఎందరో జీవితానుభవాలను చదవడం వల్ల కూర్చున్న చోటి నుంచే ప్రపంచాన్ని దర్శించవచ్చు. నిత్య పఠనం జీవితాన్ని వికసింపజేస్తుంది. చీకటిదారులలో వెలుగులను పంచుతుంది. వ్యక్తిగా సంస్కరించబడి నిజాయితీ, సహనశీలత ఒంటబడుతుంది. ద్రోహ చింతన, వస్తువ్యామోహం, ఈర్ష్యా ద్వేషాల నుంచి విముక్తి లభిస్తుంది. బౌద్ధిక శుద్ధికి, మానసిక ప్రశాంతతకు పఠనమే చికిత్స. సాహిత్యం ఏ మాధ్యమంలో, ఏ రూపంలో దొరికినా కాగితంపై వచ్చే అక్షరమే అన్ని విధాలా శ్రేయస్కరం. అందుకే, సాహిత్యానికి పుస్తక ముద్రణే శాశ్వత రూపం. శరీరానికి నీరు, ఆహారం మాదిరే మెదడు చురుకుదనానికి పఠనమే ఆధారం.
సాహిత్యానికి ఎల్లలు లేవు
సాహిత్యానికి ఎల్లలు లేవు. భక్తి నుంచి విప్లవం దాకా అన్నీ ఆ సముద్రంలోని అలలే. ప్రతి మనిషి తమ అభిరుచి, ఆసక్తి మేరకు పుస్తకాలు లభ్యమవుతాయి. నచ్చిన అంశాలపై పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాక కూడా 'తెలుగువాడు పుస్తకాలు కొనడు.. చదువడు' అనే నిందని మోసే బదులు ప్రతి ఒక్కరు ఈ నెల తమ ఆదాయంలోంచి పది శాతం బుక్ ఫెయిర్‌లో పుస్తకాలు కొనుగోలుకు కేటాయించండి.
బుక్ ఫెయిర్ సందర్శకులందరూ కనీసం వెయ్యి రూపాయల పుస్తకాలు కొనాల్సిందే అని తీర్మానించుకోండి.
పుస్తకం చదివి బావుంటే లేదా నచ్చకపోతే నాలుగు మాటలు రచయితతో పంచుకోండి. తెలుగు పుస్తకాన్ని బతికించడం రచయితల చేతిలో కాదు, పాఠకుల ఆదరణతో ఉంది. అందుకే చెయ్యెత్తి పుస్తకాన్ని జై కొట్టండి సాహిత్యాన్ని పెంపొందించుకోండి.
పుస్తకాలు చదివితేనే జ్ఞానం పెంపొందించుకోగలం
పుస్తకం అమ్మ వంటిది. పుస్తకాలు చదివితేనే జ్ఞానం సంపాదించగలం, కొత్తది నేర్చుకోగలం, రాయగలం, మన చర్రితను తెలుసుకోగలం.. కాపాడుకోగలం. సామాజిక పరిణామ క్రమం తెలియాలంటే సాహిత్యాన్ని చదువాలి. పుస్తక పఠనం విలువను రేపటి పౌరులకు తెలియజేయడంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కీలకపాత్ర పోషిస్తుంది. రాబోయే తరానికి భవిష్యత్తు సమాజానికి పుస్తకం సాహిత్యం వంతెనలుగా ఉత్తమ సమాజ నిర్మితమై కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించి సాహిత్య జ్ఞానాన్ని పొందాలి.
- నవతెలంగాణ బుక్ హౌస్ జనరల్ మేనేజర్, బుక్ ఫెయిర్ ప్రతినిధి వాసు