Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
- సామాజిక భద్రత లేదు
- అమలు కాని వికలాంగుల చట్టాలు
- వారిలో 65శాతం మంది నిరుద్యోగులు
- నవతెలంగాణతో ఎన్పీఆర్డీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధరన్
'వికలాంగులు సంక్లిష్టమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యల పట్ల బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.2011నుంచి కేవలం రూ.300లు పెన్షన్ ఇచ్చి చేతుల దులుపుకుంటున్నది. నూతన ఆర్థిక విధానాల ప్రభావం వికలాంగులపై తీవ్రంగా ఉంది. లబ్దిదారులను క్రమంగా తగ్గిస్తున్నది. కనీస అవసరాలైన ఆహారం, ఇండ్లు, వైద్యం వారికి ఆమడ దూరంలో ఉన్నాయి'అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీఆర్డీ అఖిల భారత మహాసభలు సోమవారం నుంచి ఈ నెల 28వరకు హైదరాబాద్‌లో కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఆ మహాసభల్లో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన ఆయన నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు...
దేశ వ్యాప్తంగా వికలాంగుల పరిస్థితి ఎలా ఉంది?
వికలాంగులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు అందరి సమస్యల్లాంటివి కావు. ప్రభుత్వాలు వీరి సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దేశంలో 2.21 శాతం మంది వికలాంగులున్నారు. డబ్ల్యుహెచ్ఓ లెక్కల ప్రకారం 10నుంచి 15శాతం మంది ఉంటారు. దేశంలో వికలాంగుల సంఖ్యను లెక్కించడంలో లోపం ఉంది. 2016 ఆర్పీడీ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. అందరికీ సమాన హక్కులు కల్పించాలని చట్టంలో ఉంది. వికలాంగుల్లో 70శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారందరూ పేదరికంతో బాధపడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవు. ఆరోగ్య సంరక్షణ లేక అవస్థలు పడుతున్నారు. కొద్ది మంది వికలాంగులకు సహయకుల అవసరముంటుంది. అలాంటి అవకాశాలను కల్పించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. వారికి సామాజిక భద్రత లేదు. ప్రభుత్వ పథకాల్లో 25శాతం అదనంగా ఇవ్వాలని చట్టంలో ఉంది. కానీ.. ప్రభుత్వాలు ఆయా చట్టాలను అమలు చేయవు. 2011 నుంచి వికలాంగులకు పెన్షన్లు అవసరాల మేరకు పెంచటం లేదు. కేవలం రూ.300 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇందిరా గాంధీ డిజేబుల్ పెన్షన్ స్కీం ద్వారా కేవలం 3.8 శాతం మంది వికలాంగులకే పెన్షన్ వస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల ప్రాతినిధ్యం ఎలా ఉంది?
దేశంలో 65శాతం మంది వికలాంగులు నిరుద్యోగులుగా ఉన్నారని నిటి ఆయోగ్ ప్రకటించింది. మిగతా 35శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. వారి సమస్యలు వర్ణనాతీతం. ఇందులో ఎక్కువ మంది స్వయం ఉపాధిపై ఆధారపడి బతుకుతున్న వారే. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో మూడు శాతం రిజర్వేషన్లు ఉంటే..అవి ఎక్కడా అమలు కావటం లేదు. నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టంలో ఉంది. కానీ..అమలు చేయటం లేదు. వికలాంగ ఉద్యోగుల పట్ల అణచివేత, వివక్షత ఉంది. దీనిపై సుప్రీం కోర్టు స్వయంగా చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయటం లేదు. 1991 తర్వాత దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగమంతా ప్రయివేటు పరం అవుతోంది. అందుకే ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్పీఆర్డీ డిమాండ్ చేస్తున్నది. ఆయా సంస్థల్లో వికలాంగులకు ఖచ్చితంగా ఉద్యోగాలివ్వాలనే నిబంధనను ప్రభుత్వం విధించాలి.
వికలాంగుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది.?
కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా ఉందనటానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. 2020-21లో 0.009 శాతం నిధులను వారి కోసం కేటాయించగా, 2022-23లో 0.0084శాతం మాత్రమే కేటాయించింది. వికలాంగులు ఎప్పటి నుంచో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా దివ్యాంగులని నామకరణం చేసి, యాక్సెస్బుల్ ఇండియాగా ప్రచారం చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం మూలంగా కేటాయించిన నిధుల్లో 35శాతం ఖర్చుకాకుండా మిగిలిపోయాయంటే..వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు వికలాంగుల హక్కుల మీద కేంద్రం దాడి చేస్తున్నది. 2016 ఆర్పీడీ చట్టంలో సవరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. వారి కోసం ఉన్న చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. వికలాంగుల పోస్టులను గుర్తించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సివిల్ సర్వీసు ఉద్యోగ నియామకాల్లో కొన్ని పోస్టులనుంచి వారిని మినహాయించాలని చూస్తున్నది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి వాటిల్లో రిజర్వేషన్లు అమలు చేయోద్దనే ఆలోచన చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులున్నాయి. 2016 ఆర్పీడీ చట్టం పర్యవేక్షణ కోసం చీఫ్ కమిషనర్‌ను నియమించాలి. ఆయన నేతృత్వంలో వికలాంగుల రోజువారీ సమస్యలపై పనిచేయాలి. కానీ..కమిషనర్‌ను నియమించలేదు. నేషనల్ ట్రస్ట్ చైర్మెన్‌ను నియమించలేదు. ఆర్సీఐకి కూడా చైర్మెన్‌ను నియమించలేదు.ఆయా పోస్టులను ఎందుకు నియమించలేదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటి ప్రశ్నించింది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
నూతన విద్యావిధానం ప్రభావం వికలాంగులపై ఎలా ఉంటుంది?
ఈ విధానాన్ని ఎన్పీఆర్డీ వ్యతిరేకిస్తున్నది. వికలాంగులకు ఉపయోగపడే నైబర్ఉడ్స్ సెంటర్స్ మూసేయాలని ఎన్ఈపీ చెబుతున్నది. ఒకే ప్రాంతంలో ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని చెబుతున్నది. ఆన్లైన్ విద్యను ప్రొత్సహిస్తున్నది.దీంతో వికలాంగులు విద్యకు దూరమవుతారు.
ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు, సాధించిన విజయాలేంటి?
వికలాంగుల హక్కుల కోసం 2010 నుంచి ఎన్పీఆర్డీ పోరాటం చేస్తున్నది. ఒకే రకమైన దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఉద్యమం చేసి విజయం సాధించింది.మహిళా వికలాంగులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అణచివేతకు వ్యతిరేకంగా ఇతర సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపట్టాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను పెంచాలని తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్య మాలు నిర్వహించాం. విజయాలు సాధించాం. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేకమైన పనులు కల్పించాలంటూ ఉద్యమం చేసి విజయం సాధించాం. కోవిడ్-19 సమయంలో వికలాంగులను, వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ ఉద్యమం చేశాం.
ఎన్పీఆర్డీ జాతీయ మూడో మహాసభలద్వారా వికలాంగులకు మీరిచ్చే సందేశం?
మహాసభలో వికలాంగుల స్థితిగతులపై చర్చిస్తాం. కరోనా తర్వాత వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాం. సామాజిక భద్రత, బడ్జెట్లో ఐదు శాతం నిధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 25శాతం అదనంగా కేటాయించాలని డిమాండ్ చేస్తాం. పాలకుల విధానాల ఫలితంగా రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వికలాంగులకు, వారి జీవితావసరాలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలనీ, తదితర తీర్మానాలు మహాసభలో చేయనున్నాం. వీటికి అనుగుణంగా భవిష్యత్ పోరాటాలకు పిలుపునిస్తాం. పోరాడి హక్కుల్ని సాధించుకుందామనే సందేశాన్ని ఇవ్వబోతున్నాం.