Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటం : ఏఐఎస్ఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం తప్పదని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని తెలిపారు. వాటిలో చదివే విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక వసతుల్లేవనీ, టాయిలెట్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేవని తెలిపారు. మధ్యాహ్న భోజన వంట గదులు లేవని విమర్శించారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని వివరించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్లకు సొంత భవనాల్లేవనీ, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.