Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నష్టంకలిగే రీతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయ డిప్యూటేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించడానికి తాత్కాలికంగా చేపట్టిన సర్దుబాటు పేరుతో డిప్యూటేషన్లతో ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు అపార నష్టం కలుగుతున్నదని తెలిపారు. విద్యార్థుల అవసరం మేరకు, నిబంధనలను పాటిస్తూ వేయాల్సిన డిప్యూటేషన్లు, ఉపాధ్యాయులకు వ్యక్తిగత లబ్ది చేకూర్చేందుకు, అవినీతికి పాల్పడి, జరపడంతో పలు చోట్ల పాఠశాలలు మూతబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఉపాధ్యాయులైతే విద్యా హక్కు చట్టానికి, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా బోధనేతర పనులు చేస్తూ మండల వనరుల కేంద్రాల్లో (ఎంఆర్సీ), జిల్లా విద్యా కార్యాలయాల్లో అనధికారిక డిప్యూటేషన్ల లో కొనసాగుతున్నారని వివరించారు. ఎస్సీఈఆర్టీ, హైదరాబాద్ కేంద్రంగా గల వివిధ కార్యాలయాల్లో, ఉపాధ్యాయుల స్వప్రయోజనాల కోసం ఉంటూ విద్యార్థులకు నష్టం కలిగించే డిప్యూటేషన్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.