Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ బార్ అసోసియేషన్‌లో ఐదు నుంచి పదేండ్ల సర్వీస్ ఉన్న జూనియర్/యువ న్యాయవాదులకు స్టైఫండ్, ఆరోగ్యకార్డులను మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం న్యాయవాదులు తమ వంతు పోరాటాలు నిర్వహించారని తెలిపారు. న్యాయ కళాశాలల నుంచి కొత్తగా వచ్చిన జూనియర్ న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు జూనియర్లు కాబట్టి కొత్తగా కేసులు వారికి రావని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదుల దగ్గర కొన్నేండ్లపాటు పని చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిడ్ పరిస్థితుల్లో కోర్టులు మూతపడి కేసుల్లేక జూనియర్ న్యాయవాదులకు మనుగడ లేకపోవడంతో ఇతర వనరులపై ఆధారపడాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కొన్ని ఇతర రాష్ట్రాలు జూనియర్ న్యాయవాదుల దుస్థితిని గమనించి ఐదేండ్ల సర్వీసు కలిగిన జూనియర్ న్యాయవాదులకు సగటున రూ.ఐదు వేలు నెలకు స్టైఫండ్‌ను మంజూరు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనూ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్, ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కోరారు.