Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌ను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు (ఈడీ)కి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కేసుకు సంబంధించి నందకుమార్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, మొయినాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైనా ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు ఆధారంగా చేసుకొని ఈడీ కూడా విచారణను చేపట్టింది. ఇప్పటికే రెండ్రోజుల పాటు తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా రోహిత్‌రెడ్డి ఉన్నారు. కాగా, ఇదే కేసుకు సంబంధించి మూడో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను రెండ్రోజుల పాటు విచారించడానికి నాంపల్లి కోర్టును ఈడీ అధికారులు పిటిషన్ వేసి కోరారు. ఇందుకు నాంపల్లి కోర్టు శనివారం అనుమతించింది. దీంతో 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు చంచల్‌గూడ జైలులోనే నందకుమార్‌ను విచారించడానికి ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన అనుమతి పత్రాలను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు ఈడీ అధికారులు అందజేశారు. నందకుమార్‌ను విచారించాక ఈకేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి, రెండో నిందితుడు సింహయాజి స్వామిలను కూడా ఈడీ అధికారులు విచారించ నునున్నారని తెలిసింది. ఒకపక్క, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారంటూ బీజేపీకి చెందినవారిగా భావిస్తున్న రామచంద్ర భారతి, సింహయాజిస్వామి, నందకుమార్‌లను విచారించిన రాష్ట్ర సిట్ అధికారులు మరోవైపు ఈ కేసులో బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోశ్‌ను విచారించడానికి శతవిధాల ప్రయ త్నిస్తున్నారు. మరోపక్క, ఈ కేసు విచారణను సీబీఐ కి అప్పగించాలంటూ బీజేపీతో పాటు ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించగా వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు తీర్పును వెలువరించాల్సి ఉన్నది.