Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మెదక్ టౌన్
కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంఘటన జిల్లా కేంద్రమైన మెదక్లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శేట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశం, సుజాత(42) దంపతులు బతుకుదెరువు కోసం మెదక్ పట్టణానికి వలస వచ్చి పెద్దబజారులో నివాసం ఉంటున్నారు. స్థానిక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సుజాత మార్కెట్ నుంచి ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం 1 గంటలకు భర్త ఆమెకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో వెంటనే ఆయనకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఆమె విగతజీవిగా కనిపించింది. సుజాత గొంతు కోసి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును దుండగులు లాక్కెళ్లారు. వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ సైదులు, సీఐ మధు, రూరల్ సీఐ విజరుకుమార్, మెదక్ పట్టణ ఎస్ఐ మల్లారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్స్వ్యాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.