Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న ఖమ్మంకు రైతులు, కూలీలు వేలాదిమంది తరలి రావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
నవతెలంగాణ-వైరాటౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం దివాళా తీస్త్తోందని, రైతులు, కార్మికుల ఐక్యంగా పోరాడి ఆ రంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. డిసెంబర్ 29న ఖమ్మంలో జరుగుతున్న వ్యకాస బహిరంగ సభను జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు, గన్నవరం గ్రామాల్లో తమ్మినేని విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. దేశానికి కేరళ తరహా విధానాలు అవసరమని తెలిపారు. దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ తీరును వివరించారు. బీజేపీ ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి కలిసి వచ్చే శక్తులతో భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని, రైతులు, కూలీలు అందరూ కమ్యూనిస్టుల పోరాటాలను బలపరచాలని కోరారు. ప్రజానుకూలంగా పరిపాలన అందిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 29న ఖమ్మం బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ సభకు గొల్లెనపాడు, గన్నవరం గ్రామాల శాఖల కార్యదర్శులు అమరనేని వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, వైరా విశాల సహకార పరపతి సంఘం వైస్ చైర్మెన్ కొణిదన కోటేశ్వరరావు, గన్నవరం సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మి, అష్టగుర్తి ఎంపీటీసీ కిలారు లక్ష్మి, సీనియర్ నాయకులు నల్లమోతు వెంకట నారాయణ, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.