Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలో లోపాలను, అవకతవకలను నివారించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ నియామక ఈవెంట్లలో జరుగుతున్న లోపాలను సవరించాలంటూ శనివారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాంగ్‌జంప్ దూరాన్ని 3.8 మీటర్ల నుంచి నాలుగు మీటర్లకు పెంచడంతో అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. అదేవిధంగా ఎత్తు కొలతలను డిజిటల్ పద్ధతి ద్వారా తీసుకోవడంతో సాంకేతిక లోపం వల్ల చాలా మంది అభ్యర్థులు అర్హత కోల్పోతున్నారని అన్నారు. పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు సివిల్, కమ్యూనికేషన్, ఫైర్, జైల్, ఎక్సైజ్ విభాగాల్లో మెయిన్స్‌కి అవకాశం కల్పించాలని కోరారు. లాంగ్‌జంప్‌లో ఆన్ ద లైన్ జంప్ని అనుమతించాలని అన్నారు.
డిజిటల్ విధానాన్ని తీసేసి, పాత పద్ధతిలోనే మ్యానువల్‌గా అభ్యర్థుల ఎత్తు కొలతలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రిలిమ్స్‌లో ఏడు మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావెద్, నాయకులు వేణు, శృతి, అజరు, స్టాలిన్, అభ్యర్థులు జ్యోతి, విజయలక్ష్మి, మమత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.