Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వండి : చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీకి ప్రయివేటు రవాణాతోనే ప్రధాన పోటీ అనీ, దాన్ని తట్టుకుంటూ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో 1.51 కోట్ల ప్రయివేటు వాహనాలు ఉన్నాయనీ, వీటిలో ఎక్కువ వ్యక్తిగత వాహనాలు ఉన్నాయని తెలిపారు. సకాలంలో సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తిగత వాహనదారుల్లో కల్పిస్తే, వారు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ముందుకు వస్తారని చెప్పారు. అది జరిగితే ఇప్పుడున్న 67 శాతం ఓఆర్ 80 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీలో పాత బస్సుల స్థానంలో కొత్తగా వచ్చిన సెమీ, సూపర్ లగ్జరీ బస్సులను శనివారం ట్యాంక్‌బండ్‌పై ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 760 బస్సులు మార్చి నాటికి వస్తుండగా, శనివారం 51 కొత్త బస్సుల్ని ప్రత్యేక పూజలు చేసి, రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీకి టిక్కెట్ ఆదాయమే ప్రధాన వనరు అనీ, దాన్ని పెంచుకొనే ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఆరువేల ఆర్టీసీ, 3వేల అద్దె బస్సులు ఉన్నాయనీ, కొత్తగా వచ్చే వెయ్యి బస్సులతో మొత్తం పదివేల బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీలను మూసివేస్తున్నా, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ప్రజారవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రభుత్వ సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. గతంలో సంస్థకు నెలకు రూ.వెయ్యి కోట్ల నుంచి 1,500 కోట్ల నష్టం ఉంటే, ఇప్పుడు రూ.70 కోట్లకు చేరిందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలనీ, ఆ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చామన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డిఏలు ఇచ్చామని చెప్పారు. సంస్థ లాజిస్టిక్స్ కమర్షియల్ ఆదాయం పెంచుకోవాల్సి ఉందన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే, ప్రజలకు సంస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ టిక్కెట్ రేట్లు పెంచలేదనీ, కేంద్రం డీజిల్ ధరలు పెంచడం వల్లే వివిధ సెస్‌లు పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొత్త బస్సుల్ని సమకూర్చుకున్నట్టు తెలిపారు. సంస్థలోని అన్ని డీజిల్ బస్సుల్ని ఐదేండ్లలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సుల్ని ప్రవేశపెడతామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ (ఆర్ అండ్ బీ) కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.