Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ కాలంలోనూ తగ్గని ఆదరణ
- ఆంగ్ల మాధ్యమం చదువులొచ్చినా తెలుగు అజేయం
- పుస్తక పఠనంతోనే జ్ఞాన తెలంగాణ నిర్మాణం
- ప్రజల వద్దకు పుస్తకాలు తీసుకెళ్లేందుకు ప్రణాళిక
- నవతెలంగాణతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు
జూలూరు గౌరీశంకర్ సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా
వాటన్నింటినీ తట్టుకుని పుస్తకం చిరంజీవిగా వర్ధిల్లుతున్నదని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు. డిజిటల్ కాలంలోనూ పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదన్నారు. ఆంగ్ల మాధ్యమం చదువులొచ్చినా తెలుగు భాష అజేయమని అన్నారు. అందుకే దేశ భాషలందు తెలుగులెస్స అన్నారని గుర్తు చేశారు. తెలుగు దినపత్రికలు, పుస్తకాలకు ఉన్న ఆదరణే అందుకు నిదర్శనమని వివరించారు. పుస్తక పఠనంతోనే జ్ఞాన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. పుస్తకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌వద్ద ఉన్న తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో ఈనెల 22 నుంచి ప్రారంభమైన పుస్తక ప్రదర్శన సందర్భంగా ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌తో ప్రత్యేక ముచ్చటించారు. ఆ వివరాలు...
ఈ పుస్తక ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటీ?
ఇటీవల కాలంలో పుస్తక పఠనం తగ్గిందంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వాదన సరైంది కాదు. విస్తారంగా పెరిగింది. తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సాంస్కృతిక, కళలు, సంప్రదాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, విప్లవాలు, సాంఘిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, పోటీ పరీక్షలు, డిజిటల్ మాధ్యమాలు వంటి అనేక అంశాలపై పుస్తకాలున్నాయి. అయితే వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసమే ఈ పుస్తక ప్రదర్శన జరుగుతున్నది.
ఆంగ్ల మాధ్యమం చదువులు, డిజిటల్ కాలంలో తెలుగు పుస్తకాలకు ఆదరణ ఉంటుందా?
ఆంగ్ల మాధ్యమం చదువులొచ్చిన ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ తెలుగు భాష అజేయం. తెలుగు పుస్తకాలకు ఆదరణ తగ్గిపోలేదు. ఆంగ్ల మాధ్యమం పుస్తకాల అనువాదం రోజురోజుకు పెరుగుతున్నది. భారతదేశంతోపాటు తెలంగాణ చరిత్ర, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను తెలుసుకోవడానికి తెలుగు పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పుస్తకాలు దొరికినా చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. పుస్తక పఠనంతోనే మానసిక సంతృప్తి ఉంటుంది. అందుకే పుస్తకం చిరంజీవిగా వర్ధిల్లుతున్నది. కోట్ల మంది ప్రజలకు చేరుతున్నది. దినపత్రికలను చదివే వారి సంఖ్యను గమనిస్తే తెలుగుకు ఆదరణ తగ్గలేదని అర్థమవుతుంది. తెలుగు భాషకు డిమాండ్ తగ్గలేదు.
ఏ తరహా పుస్తకాలను ప్రజలు ఆదరిస్తున్నారు?
టీటీడీ ప్రచురించిన పుస్తకాలు లక్షల్లో అమ్ముడవు తున్నాయి. ఇంకోవైపు కమ్యూనిజం పుస్తకాలు ఇటీవల కాలంలోనే రెండు లక్షలు అమ్ముడయ్యాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన బ్రహ్మంగారి కాలజ్ఞానం పుస్తకాలను కూడా విరివిగా విక్రయిస్తున్నారు. కారల్ మార్క్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి ఫూలే, జోతిబాఫూలే వంటి పుస్తకాలు లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. భారత రాజ్యాంగం ఆంగ్ల మాధ్యమం నుంచి తెలుగు మాధ్యమంలోకి అనువాదం అయ్యాక ఎక్కువ మంది చదువుతున్నారు.
యువతలో పుస్తక పఠనం పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
యువతను ఆకర్షించేందుకు, పుస్తకాలు కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. అందుకు అవసరమైన తెలంగాణ చరిత్ర, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల పట్ల లోతైన అధ్యయనం చేసేందుకు ఉపయోగపడేలా పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నాం. పోటీ పరీక్షల కోసం చదివే యువతకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
విద్యార్థులు, పిల్లల కోసం ఎలాంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి?
చెలిమి సంస్థ ద్వారా వేదకుమార్, మంచి పుస్తకం పేరుతో హరీశ్‌తోపాటు నవతెలంగాణ, నవచేతన పబ్లిషింగ్ హౌస్‌లు పిల్లల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాయి. పిల్లలు వారి సొంత అనుభవంతో రాసే పుస్తకాలున్నాయి. వాటిని ఎక్కువ మంది ఆకర్షించేందుకు అవకాశమున్నది. ఆ పుస్తకాలపై ప్రత్యేక రాయితీ ఉంటుంది.
బుక్ ఫెయిర్ ద్వారా రచయితలు, కవుల సాహిత్యం ప్రజలు ఆదరిస్తున్నారా?
పుస్తక ప్రదర్శనలో రైటర్స్ స్టాల్ పెట్టాం. రచయితలు రాసిన పుస్తకాలను వారే ఆ స్టాల్లో పెట్టి అమ్ముకోవాలి. తెలంగాణ, ఏపీలో కలిపి సుమారు పదివేల మంది కవులు, రచయితలున్నారు. కథలు, నవల, వ్యాస రచయితలున్నారు. వారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తెచ్చేందుకు ప్రోత్సాహం అందిస్తున్నాం.
ఊరూరా పుస్తక ప్రదర్శన నిర్వహించాల్సిన అవసరముందంటారా?
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నది. హైదరాబాద్ మెట్రో స్టేసన్లలో పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సంప్రదించి వారి డివిజన్లలో పుస్తకాలను అమ్మాలి. నవతెలంగాణ, నవచేతన పబ్లిషింగ్ హౌస్‌లు బస్సు ద్వారా ప్రజల వద్దకు పుస్తకాలను తీసుకెళ్లాయి. మంచి ఆదరణ ఉన్నది. ఊరూరికి రీడర్స్ క్లబ్బులను ఏర్పాటు చేయాలి. గ్రామపంచాయతీల్లో ఉండే రచ్చబండ వద్ద పుస్తక ప్రదర్శనలను పెట్టాలి. రైతులకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. భూమి, పంటలు, ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించినవి ఉండాలి. అలా ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి. పుస్తక పఠనాన్ని పెంపొందించాలి. అప్పుడే జ్ఞాన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది.
ప్రభుత్వ సహకారం ఎలా ఉందంటారు?
ప్రభుత్వ సహకారం వల్లే ఎన్టీఆర్ స్టేడియాన్ని ఏటా ఉచితంగా ఇస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తక ప్రియుడు. అందుకే ఈ పుస్తక ప్రదర్శనకు సహాయ సహకారాలను అందిస్తున్నారు.