Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు, మతోన్మాదులకు తొత్తు
- 'నేషనల్ మానిటైజేషన్ పైపులైన్' పేరుతో దోపిడీ
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏప్రిల్ 5న ఢిల్లీ ముట్టడి : సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్లు, మతోన్మాదులకు తొత్తుగా.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ధ్యేయంగా బీజేపీ పాలన సాగుతోందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం వేస్తూ.. పెట్టుబడిదారులకు రూ.10 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మౌలిక వసతులు అన్నింటినీ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు 'నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్' స్కీం పేరుతో కట్టబెడుతున్నారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తూ... ప్రతిపక్షాలు, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు, చివరకు జర్నలిస్టులపైనా సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని తెలిపారు. దేశంలో 256 ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలతో నడుస్తున్నా వాటిని ప్రయివేటీకరించేందుకు పూనుకుందన్నారు. 40 కోట్ల మంది పాలసీదారులు ఉన్న ఎల్ఐసీ అనే సంస్థలో లక్ష కోట్ల వాటాలను బీజేపీ ప్రభుత్వం అమ్మేసిందన్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్లు, విద్యుత్ చట్టాలు వంటివి దేశప్రయోజనాలకు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. జనవరిలో ప్రతి ఇంటికీ వెళ్లి బీజేపీ మతోన్మాదం, కార్పొరేట్ విధానాల గురించి వివరిస్తామన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి సరికాదని, కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కోటి మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా ఎనిమిదేండ్లుగా వారికి ఎటువంటి వేతన పెంపుదల లేదన్నారు. వ్యవసాయ కార్మికులు, సన్నా చిన్నకారు రైతాంగం, కౌలు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు రైతుల పట్టాల విషయంలోనూ జాప్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించకుండా బీజేపీపై పోరాటం అర్థం లేనిదన్నారు. కేరళలో రోజువారి కూలీ రూ. 830 చొప్పున చెల్లిస్తూ ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదపడుతుందన్నారు. ఇవేవీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న సంఘాలు, కార్మికులను అణచివేస్తుండటం సరికాదన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 29న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు వేలసంఖ్యలో కార్మికులు తరలాల్సిందిగా పిలుపునిచ్చారు.