Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ కమిషనరేట్‌లో పెరిగిన నేరాలు, ఘోరాలు
- మహిళలపై హత్యలు, లైంగిక వేధింపులు, గృహ హింస
- సైబర్ క్రైమ్ కేసులు అధికం : సీపీ మహేష్ భగవత్
- 2022 సంవత్సరపు వార్షిక నేర నివేదిక విడుదల
నవతెలంగాణ-సిటీ బ్యూరో / హయత్‌నగర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని సీపీ, అడిషనల్ డీజీ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. తన సర్వీస్‌లో ఒక్క కమిషనరేట్‌లో ఇన్ని సంవత్సరాలు విధులు నిర్వహిస్తానని అనుకోలేదన్నారు. ఈ ప్రభుత్వంలో సుమారు 7 సంవత్సరాలు చేశానని, ప్రతి రోజూ నూతన పద్ధతిలో, ప్రతి కేసుకూ ప్రాధాన్యత ఇవ్వడం వలనే విజయవంతమయ్యానని చెప్పారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో 2022 సంవత్సరపు వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. 2021తో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 19 శాతం పెరిగాయని తెలిపారు. అయితే, హత్యలు 29 శాతం తగ్గాయని చెప్పారు. కిడ్నాప్‌లు 38 శాతం, లైంగికదాడులు 1.33 శాతం, వరకట్న మరణాలు 5.88 శాతం, నరహత్య కేసులు 50 శాతం, ఆత్మహత్యకు ప్రేరేపించడం 84 శాతం, మహిళల హత్య కేసులు 63 శాతం, బలహీన వర్గాలపై నేరాలు 2 శాతం తగ్గాయన్నారు. అటెన్షన్ డైవర్షన్ కేసులు కూడా 11.67 శాతం తగ్గాయని చెప్పారు. ఇక చీటింగ్ కేసులు 3 శాతం, మహిళలపై నేరాలు 17 శాతం, ఆస్తి నేరాలు 23 శాతం పెరిగాయని తెలిపారు. చోరీలకు సంబంధించి రికవరీ రేటు 57 శాతం నుంచి 63 శాతానికి పెరిగిందని తెలిపారు. ఎన్డీపీఎస్ కేసులు 140 శాతం, గేమింగ్ యాక్ట్ కేసులు 17 శాతం పెరగగా.. పీఐటీఏ కేసులు 3 శాతం, గుట్కా కేసులు 131 శాతం తగ్గాయని వెల్లడించారు. సైబర్ క్రైమ్ కేసులు 66 శాతం పెరిగాయని, రోడ్డు ప్రమాద కేసులు 19 శాతం, ప్రాణాంతక ప్రమాదాలు 0.16 శాతం పెరిగాయని తెలిపారు. ప్రమాదాల్లో మరణాలు 0.91 శాతం, ఓఆర్ఆర్పై ప్రాణాంతక ప్రమాదాలు 7.69 శాతం తగ్గాయన్నారు. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో మరణాలు 31.58 శాతం తగ్గాయని వివరించారు. తన సర్వీస్‌లో అత్యధిక కాలం రాచకొండ కమిషనరేట్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉందని సీపీ అన్నారు. తమ సిబ్బంది ప్రతి విభాగంలోనూ అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నేరస్థులకు అత్యధికంగా శిక్షలు విధించింది రాచకొండ కమిషనరేట్‌లో మాత్రమే అని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్యాధునిక టెక్నాలజీ రావడంతో దొంగలు సైతం తమ రూటు మార్చి సైబర్ నేరాలకు పాల్పడి సులభంగా నగదు కాజేస్తున్నారని చెప్పారు. యువత ఎక్కువగా ఆశలకుపోయి స్మార్ట్ ఫోన్ల ద్వారా నగదు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రాచకొండలో ఉన్న 3 జోన్ల డీసీపీలు, ఏసీపీలు, 56 పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.