Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 డైరెక్టర్ స్థానాలకు ముగిసిన పోలింగ్
- 84శాతం పోలింగ్ నమోదు.. చెదురు మొదురు ఘటనలు నమోదు
- అక్కడక్కడా అధికార పార్టీ నేతల్లో కుమ్ములాటలు
- క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమే చేసిన విపక్ష పార్టీలు
- ఆయా పార్టీలు బలపరిచి అభ్యర్థులకే మెజార్టీ ఓట్లు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల
నెలరోజులుగా వాడీవేడీగా సాగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) ఎన్నికలకు శనివారం ఫుల్స్టాప్ పడింది. శనివారం సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకూ కొనసాగింది. 13 మండలాల్లోని 15 డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఈ పోలింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన 202పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. బరిలో 75 మంది అభ్యర్థులు నిలవగా.. 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు, 1100 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సెస్ పీటం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నెలకొంది. అధికారపార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించినప్పటికీ అక్కడక్కడా పార్టీ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు ప్రభావం చూపు తాయాయన్న ప్రశ్నతలెత్తుతోంది. దీనికితోడు పెద్దగా బలంలేని విపక్ష పార్టీలు సైతం క్షేత్రస్థాయిలోనే ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో పార్టీలతో సంబంధం లేకుండా ఇతర గుర్తులపై ఎన్నికలు నిర్వహించిన, ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బ్యాక్సుల్లో దాగుంది. పోటీ చేసిన స్వతంత్య్రులు చీల్చే ఓట్లు కూడా ఎవరికి పట్టం కడతాయోనన్న ఆందోళన ఆయా పార్టీ వర్గాల్లో నెలకొంది.
చెదురు మొదురు ఘటనలు
పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గంభీరావుపేట మండలం నాగంపేట పోలింగ్ కేంద్ర వద్ద అధికార పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పోలింగ్బూత్లోకి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పలుమార్లు వస్తూ వెళుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో కొంత ఆందోళన వాతావరణం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజి బూత్ వద్ద అధికార పార్టీ కౌన్సిలర్ భర్త బహిరంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు 87,130 ఓటర్లును అధికారులు గుర్తించారు. 84శాతం పోలింగ్ నమోదు చేసుకుంది. ఇల్లంతకుంట, వీర్నపల్లి, వేములవాడటౌన్-2 పోలింగ్ కేంద్రాల్లో 90శాతం పోలింగ్ అయింది. అత్యల్పంగా సిరిసిల్ల టౌన్-2లో 76శాతమే నమోదు చేసుకుంది.