Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతాళానికి టమాట ధర..
- పశువులను మేపుతున్న వైనం
- మార్కెట్‌కు తీసుకెళ్తే ఖర్చులే రావడం లేదు
- తెంచకుండా పొలంలోనే వదిలేస్తున్న రైతులు
- హోల్‌సేల్‌గా కిలో ఫస్ట్ క్వాలిటీ రూ.4, సెకండ్ క్వాలిటీ రూ.3
- బయట మార్కెట్లో రిటైల్‌గా కిలో రూ.10
- నష్టపోతున్న రైతులు, లబ్దిపొందుతున్న వ్యాపారులు
నవతెలంగాణ-నల్లగొండ
నిన్నటి వరకూ వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాట ధర అమాంతం పాతాళానికి పడిపోయింది. ఏడాది పొడవునా డిమాండ్ ఉండే టమాట ధర ప్రస్తుతం రైతుకు కన్నీటిని మిగిల్చింది. వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లాలో టమాట సాగు 1200 ఎకరాల్లో సాగైంది. ఇదే తరహాలో టమాట ఉత్పత్తి కూడా పెరిగింది. అయితే, మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధర (హోల్‌సేల్‌గా) 25 కిలోల బాక్స్ రూ.80-100 పలుకుతుంది. ఫస్ట్ క్వాలిటీ రకం టమాటకు రూ.100, సెకండ్ క్వాలిటీ రూ.70-80 అమ్ముడుపోతుంది. ఎకరం విస్తీర్ణంలో టమాట సాగు చేసేందుకు రూ.40- రూ.50 వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. పంట దిగుబడి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. మార్కెట్లో ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటాలు తెంపి మార్కెట్‌కు తరలిచేందుకు ఒక బాక్స్‌కు రూ.40 నుండి రూ.60 రూపాయలు ఆటో కిరాయి అవుతుంది. ఒక్కో రైతు సుమారు రోజుకు 50-80 బాక్స్‌లు మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఒక బాక్స్‌కు సుమారు రూ.30 రవాణా చార్జీలు వేసుకుంటే.. 50 బాక్స్‌లకు రూ. 1500 ఆటో చార్జీలు అవుతున్నాయి. మార్కెట్లో పంట అమ్మితే.. కనీసం రవాణా చార్జీలు కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. గతేడాది ఏడాది కిలో టమాట రూ.80 నుంచి రూ.100 ధర పలికింది. ఈ సారి కూడా మంచి ధర వస్తుందనే గంపెడాశతో సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. భూమి కౌలుకు తీసుకుని సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రభుత్వం టమాట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
రిటైల్‌గా కిలో టమాటకు రూ.10...
కూరగాయల మార్కెట్లో రైతుల వద్ద దళారులు కిలో టమాట మూడు రూపాయలకు కొనుగోలు చేస్తే..అదే టమాటాను కూరగాయల వ్యాపారులు మాత్రం కిలో టమాట రూ.10కి అమ్ముతున్నారు. కిలో టమాటపైన వ్యాపారులు రూ.9 వరకు లబ్దిందుతున్నారు. కానీ.. రైతులు మాత్రం నష్టపోతున్నారు.
శీతల గిడ్డంగులు ఎక్కడ...?
పంటలను నిల్వ ఉంచుకునేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా శీతలగిడ్డంగులు ఏర్పాటు చేస్తామంటున్న పాలకుల మాటలు ఆచరణ రూపం దాల్చడం లేదు. గిట్టుబాటు ధర రాకుంటే.. పంటను నిలువ ఉంచుకునేందుకు జిల్లాలో శీతల గిడ్డంగులు కరువయ్యాయి.
రవాణా చార్జీలు కూడా వస్తలే
పంతంగి లింగస్వామి-రైతు, గుండ్లపల్లి
ఎకరం విస్తీర్ణంలో టమాట సాగు చేశాను. పంట కోసం రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పటివరకు మూడు సార్లు టమాటను తెంపాం. ఫస్ట్ కోతలో 60 బాక్స్‌లు, సెకండ్ కోతలో 30 బాక్స్‌లు, థర్డ్ కోతలో 65 బాక్స్‌ల టమాటలు వచ్చాయి. ఒక బాక్స్ (25 కిలోలు) 80 రూపాయలకు అమ్ముడుపోయింది. పంటను పొలం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు ఒక బాక్స్‌కు రూ.25 ఆటోకిరాయి తీసుకున్నారు. పంట తెంపేందుకు రోజుకు మహిళకు రూ.300 కూలీ, కల్లుసీసా, మగవారికి రూ.600 కూలీ, క్వార్టర్ మందు పోయించా. పంట అమ్మితే కనీసం రవాణా చార్జీలు రాలేదు.
ఆటో కిరాయి రూ.600...
రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాట పంట సాగు చేశాను. కౌలు రూ. 12 వేలు, పంట సాగుకోసం పెట్టుబడిగా రూ.60 వేల వరకు పెట్టాను. నాలుగు కోతలు తీశాను. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌కు 18 బాక్స్‌లు తీసుకొచ్చా. ఆటో కిరాయి రూ.600 తీసుకున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు.పంట సాగు చేసి నష్టపోయాను.
- కొండ వెంకన్న,రైతు కంచనపల్లి
ఉత్పత్తి పెరిగింది ధర తగ్గింది..
గతేడాది టమాట పంటకు డిమాండ్ బాగుండే. కిలో వంద రూపాయల వరకు అమ్ముడు పోయింది. రైతులు కూడా లబ్దిపొందారు. ఈ సారి టమాటకు ధర ఉంటుందని ఎక్కువగా సాగు చేశారు. వర్షాలకు పంటలు కొంత దెబ్బతిన్నప్పటికీ.. మళ్లీ నారు వేసుకున్నారు. పంట సాగు పెరిగింది. గతేడాది 730 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా, ఈ సారి యాసంగిలో 1200 ఎకరాల వరకు సాగుచేశారు టమాట ఉత్పత్తి పెరిగింది. మార్కెట్‌కు టమాట అధికంగా రావడంతో ధర పడిపోయింది.
- సంగీతలక్ష్మి,జిల్లా ఉద్యానశాఖ అధికారి