Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఆధార్కార్డులివ్వాలి..
- ఉపాధి కూలీల సమాచారంపై కేంద్రం ఆదేశాలు !
- ఏటేటా నిధుల్లో కోత...పనికల్పన అంతంతే
- తెలంగాణలో చట్టం అమలు విషయంలో అనేక ఆటంకాలు
- ఇప్పటికే బెంగాల్లో ఉపాధి హామీ చట్టం నిలిపివేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్రల మీద కుట్రలు పన్నుతున్నది. బడ్జెట్లో భారీ నిధుల కోత విధించిన మోడీ సర్కారు.. ఇప్పుడు కూలీల సంఖ్యను తగ్గించే యత్నంలో ఉంది. మళ్లీ కొత్తగా ఆధార్కార్డులివ్వాలని మెలికపెట్టింది. ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు, త్వరలో క్షేత్రస్థాయికి విషయాన్ని చేరవేనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కూలీలకు చెల్లించాల్సిన బిల్లులు మూడు, నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల కరోనా కాలంలో చేసిన పనులకు కూడా బిల్లులు అందని దుస్థితి నెలకొంది. టీఆర్ఎస్-బీజేపీ కొనసాగుతున్న రాజకీయ పంచాయతీ కాస్త కూలీల మెడకు చుట్టుకుంటున్నది. ఆంక్షలు పెట్టి...వేతనాలు పెండింగ్‌లో పెట్టి...అడుగడుగునా ఆంటంకాలు సృష్టిస్తూ కూలీలే పనుల నుంచి తప్పించేలా చేస్తున్నది. కేరళ ప్రభుత్వం మాత్రం కూలీల పక్షం వహిస్తున్నది. పట్టణ ప్రాంతాలకూ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి మన్ననలు పొందుతున్నది.
ఉపాధి హామీ చట్టం నిర్వహణ కోసం బడ్జెట్లో నిధులకు కోతపెడుతున్నది. ఈసారి రూ.73వేల కోట్లకు కుదించింది. అందులో రూ.20 వేల కోట్లు పాత బకాయిలకే. కులాల వారీగా డేటా తీసి కూలి చెల్లింపు విషయంపై దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కాస్త వెనక్కి తగ్గింది. కానీ, మరోపంథాలో వెళ్తూ ఒక్కో రాష్ట్రంలో మెల్లమెల్లగా కుదిస్తూ పోతున్నది. బెంగాల్లో ఆ చట్టాన్నే నిలిపివేసేలా చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 18 బృందాలను పంపి తనిఖీలు చేపట్టి..రంధ్రాన్వేషణ చేసి మరీ కల్లాల పేరుతో కొర్రీలు పెట్టికూర్చున్నది. రూ.800 కోట్ల మేర నిలిపివేసింది. తాజాగా కేవలం 20 పనులను మాత్రమే గుర్తించాలనీ, వాటికే నిధులు విడుదల చేస్తామంటూ కేంద్రం మెలిక పెట్టి కూర్చున్నది. దీంతో చాలా మంది పనికోల్పోయే ప్రమాదం ఉంది. ఉపాధి కూలీలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూట పనిచేస్తున్న ఫొటోలను సైట్లో అప్లోడ్ చేయాలంటూ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను మోడీ సర్కారు ఈ ఏడాది తీసుకొచ్చింది. ఇది కార్మికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ఉపాధి హామీ చట్టం కింద ఆరుగంటలు పనిచేస్తే చాలు. కానీ, తాజా నిర్ణయంతో ఎనిమిది గంటలు పనిచేయాల్సి వస్తున్నది. ఇంత కష్టపడ్డా వారికి అందుతున్న కూలి రూ.140 నుంచి రూ.200 లోపే ఉంటున్నది. కరువులు, విపత్తులు నెలకొన్న ప్రాంతాల్లో ఉపాధి పనిదినాలను పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టింది. ఉపాధి హామీ ప్రాంతాల్లో వికలాంగులకు సౌకర్యాలు కల్పించాలనీ, వారు చేసేందుకు వీలుగా ఉన్న పనినే చూపాలని స్పష్టంగా ఉన్నా అసలు వారికి పనే చూపని దుస్థితి నెలకొంది. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఉండట్లేదు.
ఆదర్శంగా కేరళ సర్కారు...పట్టణప్రాంతాల్లోనూ 'ఉపాధి'
కేంద్రం ఈ చట్ట నిర్వీర్యానికి యత్నిస్తుండగా..ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు సాగుతున్న కేరళలోని వామపక్ష ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేస్తున్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు వెచ్చించి పట్టణ ప్రాంతాలకూ 'ఉపాధి'ని విస్తరించింది. 2016తో పోల్చిచూస్తే రెట్టింపు పనిదినాలను కూలీలకు కల్పిస్తున్నది. 100 రోజుల కల్పించడంలో గతంలో కంటే ఐదు రెట్లు మెరుగైంది. గిరిజన ప్రాంతాల్లో 200 రోజుల పనిని కూలీలకు చూపెడుతున్నది. ఆ పనుల్లో మహిళలను ఎక్కువగా భాగస్వామ్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. 99.19 శాతం వేతనాలను పని చేసిన 15 రోజుల చెల్లిస్తున్నది. మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. మన రాష్ట్రంలోనేమో గ్రామాలను మండల కేంద్రాల్లో కలిపి మున్సిపాల్టీలుగా మార్చింది. దీంతో కూలీలు ఉపాధి హామీ పనులను కోల్పోయారు. పట్టణప్రాంతాలకు ఉపాధి పనులను విస్తరించాలనే డిమాండ్‌ను కేసీఆర్ ప్రభుత్వం పక్కనపడేసింది. మేట్లకు గుర్తింపుకార్డులివ్వట్లేదు. అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
అనుసంధానం పేరుతో మరో కుట్ర
వ్యవసాయానికి ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానం చేయాలనే కుట్రకు మోడీ సర్కారు పూనుకుంటున్నది. వాస్తవానికి వ్యవసాయ పనిదినాలు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చినదే ఈ చట్టం. దీనివల్ల వ్యవసాయ కూలీల కొనుగోలు సామర్ధ్యం కొంతమేర పెరిగింది. ఆ చట్టం కొండంత అండగా నిలుస్తూ వస్తున్నది. తాజాగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అనుసంధానం అనే పల్లవిని ఎత్తుకున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అలా చేస్తే ఉపాధి కూలీలు, చిన్న, సన్న కారు రైతులు పనిదినాలను కోల్పోయే ప్రమాదం ఉంది. బడాభూస్వాములకు, కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నవాళ్లకు అనుకూల నిర్ణయం అనే విమర్శ బలంగా ఉంది.
కేరళ తరహాలో ఉపాధి చట్టానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
కేరళ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలోనూ ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా పదిశాతం నిధులు కేటాయించాలి. పట్టణప్రాంతాల్లోనూ పనులు కల్పించాలి. ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600లకు పెంచాలి. రెండు పూటల ఫొటో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వేసవి అలవెన్స్ ఎత్తివేయడం దుర్మార్గం. వెంటనే పునరుద్ధరించాలి. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలి. ఉపాధి చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయొద్దు.