Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని హాస్టల్ సంక్షేమ అధికారి పర్మినెంట్ పోస్టులను ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇవ్వడం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడింది. ఈ చర్య వల్ల సంక్షేమ అధికారులకు, ఉపాధ్యాయులకు మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కావున సంక్షేమ అధికారుల పోస్టులు వారికే ఉంచాలనీ, టీచర్లకు ఉపాధ్యాయుల్లోనే కొనసాగించాలని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎల్ మూర్తి, టి నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ పోస్ట్ కోసం ఉపాధ్యాయులు ప్రతి ఏడాది ఘర్షణ పడతారనీ, పాత వార్డెన్లు విద్యార్థులను పావులుగా వాడుకొని రాజకీయాలు కూడా చేస్తారనీ, అలాంటి వాతావరణం పోవాలంటే ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలో కూడా పర్మినెంట్ సంక్షేమ అధికారిని నియమించాలని కోరారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలకు కూడా ప్రత్యేకంగా వసతి గృహ సంక్షేమ అధికారిని నియమించాలనీ, ప్రస్తుతం సంక్షేమ అధికారులుగా కొనసాగుతున్నటువంటి వారి స్థానాలను టీచర్లతో భర్తీ చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలో విడుదల చేసినటువంటి సంక్షేమ అధికారుల డిప్టేషన్ రద్దులో తిరిగి ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళనే కొనసాగించే చర్య వెనక్కి తీసుకోవాలని కోరారు.