Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ బండారం బయటపెడతాం
- వాళ్ల కుట్రలు భగం చేసినందుకే ఈడీ విచారణలు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసి, అసందర్భ విచారణలు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులకు నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారనీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడాన్ని సహించలేక తమపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈడీ ద్వారా నోటీసు ఇచ్చి, ఏ కేసులో విచారణ చేస్తున్నారో కూడా స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తొలిరోజు ఆరుగంటలు కూర్చోబెట్టి వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. కేసుకు సంబంధంలేని అభిషేక్‌ను విచారించి, పొంతన లేని వివరాలను అడిగారని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫిర్యాదుదారుడినే విచారించడం ఏంటని ప్రశ్నించారు. కేవలం తనను భయబ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారనీ, గులాబీ సైనికుడిగా బీజేపీపై పోరాటంలో ఎక్కడా తగ్గేదేలేదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎక్కడా ఏదీ దొరక్కపోవడంతో ఇప్పుడు నందకుమార్‌ను విచారణ పేరుతో బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకొని తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మేరకు తనకు సమాచారం ఉందని చెప్పారు. తననే నేరస్థుడిగా చూపేలా నందకుమార్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి, తనతో పాటు కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనేదే బీజేపీ, ఈడీల వ్యూహమని స్పష్టం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో దొంగ దారిలో ప్రభుత్వాలను పడగొట్టారని, తెలంగాణలో ప్రయత్నం బెడిసికొట్టే సరికి బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. ఎన్ని కేసులతో భయపట్టినా, భయపడేది లేదన్నారు. ఈడీ నోటీసులు, నందకుమార్ కస్టడీపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్ సిట్ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని అడిగారు. ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదనీ, కానీ ఈడీ దానిగురించే ప్రశ్నిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలనీ, ఇది ముమ్మాటికీ ప్రజాసమస్యే అనీ, ప్రజాస్వామ్యం ఎటువెళ్తుందో అందరూ ఆలోచించి, బీజేపీ అరాచకాలను గమనించాలన్నారు.