Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఎన్పీఆర్డీ మహాసభ
- హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నేడు బహిరంగ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) మూడవ మహాసభ జరుగుతోంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే మహాసభలో.. దేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలు, ఎన్పీఆర్డీ కార్యచరణపై చర్చించనున్నారు.
మహాసభ ప్రారంభం సందర్భంగా సోమవారం ఇందిరాపార్కు వద్ద మధ్యాహ్నం 12.30గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మాజీ మంత్రి జి కాంతిగంగూలి, ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల చైర్మెన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్, కేంద్ర కమిటీ సభ్యులు ఎం జనార్థన్ రెడ్డి,సీహెచ్ సాయమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య హాజరవుతున్నారు.
పోచంపల్లిలో మహాసభ...
ప్రసిద్ది పొందిన పర్యాటక ప్రాంతం పోచంపల్లి మండల కేంద్రంలోని దేశ్ముఖ్లో జాతీయ మహాసభల నిర్వహణకు ఆహ్వానకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతి ఉట్టిపడేలా మహాసభల ప్రాంగణాన్ని ముస్తాబుచేశారు.
మహాసభకు 22 రాష్ట్రాలనుంచి 500 మంది ప్రతినిధులు రానున్నారు. ఆయా రాష్ట్రాల్లో వికలాంగుల పరిస్థితి , అమలవుతున్న సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు, వికలాంగుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కూడా కూలంకుశంగా చర్చించనున్నారు. వికలాంగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం మహాసభలో పలు తీర్మానాలు చేయనున్నారు.
మంగళవారం వికలాంగుల విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారతపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ముఖ్య అతితులుగా కేరళ సోషల్ జస్టిస్ మినిస్టర్ డాక్టర్ ఆర్ బిందు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి, డైరెక్టర్ బి శైలజ హెలెన్ కెళ్ళార్ విద్యా సంస్థల అధినేత ఉమర్ ఖాన్, టీఏఎస్ఎల్పీఏ అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్, ఇమధ్ ఖాన్, సెయింట్ మేరీ విద్యా సంస్థల చైర్మెన్ కేవికే రావు, శాస్త్రవేత్త పి జానిల హాజరవుతున్నారు.
జీఓ నెం 17పై తీర్మానం..
రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఆసర పెన్షన్ల మంజూరికి నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనలతో చాలా మందికి పెన్షన్లు రద్దవుతున్నాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వికలత్వంతో మానసిక, ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతుంటే..సంక్షేమ పథకాల్లో కోతలు విధించటం మూలంగా దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. మరో పక్క విద్య, వైద్యం అందుబాటులో లేదు. వీటిపై మహాసభలో జీఓ నెంబర్ 17ను సవరించాలనీ, వికలాంగులకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేయనున్నారు.