Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను అడ్డుకుందాం
- మనుస్మృతి దహన కార్యక్రమంలో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగాన్ని మార్చనున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించాలనీ, వేల ఏండ్లుగా సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతి భావాలను మట్టిలో పాతి పెట్టాలని వక్తలు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద మనుస్మృతిని దహనం చేశారు. అనంతరం ఎస్వీకేలో కేవీపీఎస్, ఎస్వీకే, ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన సభకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినరుకుమార్ మాట్లాడుతూ దేశంలో మెజారిటీ ప్రజలకు చదువు సంపదలు దూరం చేయడానికీ, మానసిక చట్టాల ద్వారా దోపిడీ పీడనలతో వంశపారంపర్యంగా అమలు జరుపుతూ అసమానతలకు మనుధర్మం మూలమైందన్నారు. శూద్రులు, స్త్రీలు మనుషులుగా పరిగణించకుండా అణిచివేసిందనీ, ఆధిపత్యాలకు ఆమోదం తెలిపిందని వివరించారు. వేల ఏండ్లుగా సమాజంలో దళితులను అంటరానితనానికి గురిచేసిన మను స్మృతి భావాలను మట్టిలో పాత రేయలన్నారు. కేంద్ర బీజేపీ సర్కార్ తిరిగి ఆ ధర్మాలను ప్రవేశపెట్టజూస్తున్నదన్నారు. ఈ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ మహారాష్ట్రలోని మహాద్ పట్టణం చౌదార్ చెరువు నీటిని దళితులు తాగడాన్ని బ్రహ్మణీయ వర్గాలు జీర్ణించుకోలేక, ఆవుపేడ, మూత్రం కలిపారనీ, ఆ చర్యకు మూలమైన మనుస్మతి గ్రంధాన్ని వేలాదిమందితో 1927 డిసెంబర్ 25న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దహనం చేశారని తెలిపారు. ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ స్వామి అల్వాల్ మాట్లాడుతూ బీజేపీి ప్రభుత్వం తన మాతృ సంస్థయిన ఆర్ఎస్ఎస్ దేశంలో అంటరానితనాన్ని దళితుల తిండి, సంస్కృతిపై రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తుందనివిమర్శించారు. సభలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్బాస్, ఐద్వా రాష్ట్ర ఉపాద్యక్షులు కెఎన్ ఆశాలత, డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సీనియర్ నాయకులు జి రఘుపాల్ దితరులు ప్రసంగించారు. కేవీపీఎస్ నగర నాయకులు ఎం దశరధ్, టి సుబ్బారావు, బి పవన్ ,సందేపోగు పవన్,ఎస్వీకే నాయకులు నల్లపు సోమయ్య సుజావతి, వి శంకర్, కృష్ణప్రసాద్, చెన్నయ్య, జగదీష్, వెంకన్న జానయ్య, వంశీ నాగేందర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.