Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్ ఫెయిర్లో తెలంగాణ జాగృతి స్టాల్ ప్రారంభం
నవతెలంగాణ-అడిక్ మెట్
దేశంలో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళకారులు రచనలు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం కవిత సందర్శించారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్లో తెలంగాణ జాగృతి స్టాల్ను ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాళ్లను కవిత తిలకించారు. పిల్లల పుస్తకాలు, సాహిత్యం, కథల పుస్తకాలను కొనుగొలు చేశారు. అనంతరం కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న రాసిన 'వల్లంకి తాళం' సంకలన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో కవులు, కళకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. గోరేటి వెంకన్న రచనా శైలి అద్భుతంగా ఉంటుందన్నారు. దేశంలో మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలంగాణ బిడ్డ సురవరం ప్రతాపరెడ్డికి వచ్చిందని.. ఆ పరంపర గోరేటి వెంకన్న వరకు కొనసాగుతున్నదని చెప్పారు. అనేక మంది గొప్ప కవులున్న వారసత్వాన్ని తెలంగాణ వుణికిపుచ్చుకుం దన్నారు. వారు ప్రజల హృదయాలలో తరతరాలుగా గుర్తుండిపోయేలా రచనలు చేశారని, వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకన్న చేసిన వల్లంకి తాళం రచన అంతే అద్బతంగా ఉందన్నారు. పనిలోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని.. తెలంగాణలో కూడా కష్టాలు, శ్రమ ద్వారా వారి రచనలు ఉంటాయని వారి సాహిత్యం గొప్పగా ఉంటుందని చెప్పారు. అలాగే ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా తెలుగు ఖ్యాతిపొందిందని చెప్పారు. ఈ మట్టి, శ్రమ తత్వాన్ని అణువణువునా గొరేటి వెంకన్న తన రచనలో పొందుపరిచి కవిత్వం రాసారని తెలిపారు. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాశారన్నారు. అడవి గురించి తన ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్బతమైన అంశమన్నారు. నల్లమలలో యురేనియం తవ్వడాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. మీరు పుట్టిన ఈ కాలంలో తాను పుట్టినందుకు గర్వంగా ఉందని.. మీతో పాటు కౌన్సిల్లో కూర్చోవడం సంతోషంగా ఉందని కవిత.. గొరేటి వెంకన్నతో అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ నాగేశ్వర్ రావు లు పాల్గొన్నారు.